హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొమ్మిది నెలల కూతురిపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి యువకుడిని ముంబై పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. టీ20 ప్రపంచ కప్ క్రికెట్లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. దీంతో దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు సోషల్‌మీడియా వేదికగా భారత ఆటగాళ్ల తీరును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డికి చెందిన రాంనగేశ్ అలిబత్తిని ఒక అడుగు ముందుకేసి కోహ్లీ భార్య అనుష్కశర్మ, వారి 9 నెలల కుమార్తెపై కూడా అసభ్యంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్, ముంబై సైబర్ క్రైం పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి సంగారెడ్డికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాంనగేశ్ అని గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి ముంబై తరలించారు.