Hyderabad | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 28(నమస్తే తెలంగాణ): ఆకాశహర్మ్యాలు.. ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేది న్యూయార్క్ నగరం. ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ నగరంలో 1920 నుంచి మాన్హాటన్ అనే ప్రాంతం ఈ ఆకాశహర్మ్యాలకు ప్రసిద్ధి. క్రమేణా.. ఈ భవంతులు పట్టణాభివృద్ధికి చిహ్నాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ కోల్డ్‌వెల్ బ్యాంకర్ రిచర్డ్ ఎల్లిస్ (సీబీఆర్ఈ) ఏషియన్ ప్రైవేటు లిమిటెడ్ ప్రపంచంలో నగరాల్లోని ఎత్తయిన భవనాలపై సర్వే నిర్వహించగా.. భారతదేశంలో ముంబై తర్వాత అత్యధికంగా ఎత్తయిన భవనాలు ఉన్న నగరంగా హైదరాబాద్ అని తేలింది.
మరీ ముఖ్యంగా గత తొమ్మిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసతులను కల్పిస్తుండటంతో అంతే వేగంగా అంతర్జాతీయ పెట్టుబడులు పెరుగుతున్నాయి. వెరసి.. ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో హైరైజ్ కల్చర్(ఎత్తయిన భవనాలు) కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. 10-15 అంతస్తులు అంటేనే మహా గొప్ప అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా 58 అంతస్తుల వరకు ఆకాశహర్మ్యాలు దర్శనమిస్తుండటంతో హైదరాబాద్ నగరం న్యూయార్క్ వంటి నగరాలను తలపిస్తుందంటూ సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు.
ఒక మహా నగరాభివృద్ధిలో రియల్, నిర్మాణ రంగాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ సీబీఆర్ఈ ఏషియన్ ప్రైవేటు లిమిటెడ్ ప్రపంచంలోని అనేక నగరాల్లో ఎత్తయిన భవనాలపై సర్వే నిర్వహించారు. ఈ మేరకు ‘సై ఈజ్ లిమిట్… రైస్ ఆఫ్ టాలెస్ట్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా’ పేరిట నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తయిన భవనాలు అత్యధికంగా ఉన్న నగర జాబితాలో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. షెన్‌ఝెన్, న్యూయార్క్, దుబాయ్ ఇలా అనేక నగరాలు జాబితాలో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అయితే భారతదేశానికి సంబంధించి మొదటి స్థానంలో ముంబై నిలిచింది.
ప్రపంచ నగరాల జాబితాలో ముంబై 17వ స్థానాన్ని సాధించగా, ఏసియాలోని నగరాల జాబితాలో 14వ స్థానాన్ని దక్కించుకున్నది. దేశంలో ముంబై తర్వాత అత్యధికంగా ఎత్తయిన భవనాలు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో హైదరాబాద్ నిలవడం విశేషం. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఉన్న ఎత్తయిన భవనాల్లో సుమారు 77 శాతం ఎత్తయిన భవనాలు ముంబైలో ఉన్నాయి. తర్వాత ఎనిమిది శాతం భవనాలు హైదరాబాద్ మహా నగరంలో ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. ఏడు శాతం కోల్కత్తా, ఐదు శాతం నోయిడాలో ఉండగా, ఒక్క శాతం చొప్పున గుర్గావ్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలోని మెట్రో నగరాల్లో మాత్రం హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటే బెంగళూరు, చెన్నై వంటి నగరాలు దరిదాపుల్లో కూడా లేవు.
ఆఫీస్ స్పేస్‌లో ముంబై కంటే ముందంజ..
సీబీఆర్ఈ నివేదిక ప్రకారం..ముంబైలోని ఎత్తయిన భవనాలు నూటికి 95 శాతం నివాస సముదాయాల కోసమే వినియోగిస్తున్నారు. ఇక్కడ ఎత్తయిన భవనాల్లో కేవలం ఐదు శాతం వరకు మాత్రమే ఆఫీస్ స్పేస్‌కు వాడుతున్నారు. ఇదే హైదరాబాద్ విషయానికొచ్చే సరికి.. 10-15 శాతం వరకు ఆఫీస్ స్పేస్‌కు వినియోగిస్తుండటం మరో విశేషం. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరం ఆఫీస్ స్పేస్‌లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నందున ఇదే క్రమంలో రియల్ సంస్థలు సైతం కొన్ని ఆకాశహర్మ్యాలు నిర్మించి.. ఆఫీస్ స్పేస్‌కు లీజుకు ఇస్తున్నాయి.
కోకాపేటలో అతి ఎత్తయిన భవనం..
ప్రస్తుతం నగరంలో అతి ఎత్తయిన భవనం కోకాపేటలో నిర్మాణ దశలో ఉన్నది. సాస్ కంపెనీ 58 అంతస్తుల్లో 236 మీటర్ల ఎత్తున భవనాన్ని నిర్మిస్తున్నది. 57 అంతస్తులు (200 మీటర్లు) ఒకటి, 55 అంతస్తులు (204 మీటర్లు) రెండు, 54 అంతస్తులు (214 మీటర్లు) రెండు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవే కాకుండా ఇప్పటికే నగరంలో 153 మీటర్ల ఎత్తులో 45 అంతస్తుల మేర మూడు, 42 అంతస్తుల్లో సుమారు 135 మీటర్ల ఎత్తున భవనాలు మరో మూడు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. దీంతోపాటు 25 అంతస్తులు (105 మీటర్లు) మొదలు 36 అంతస్తులు (119 మీటర్లు) వరకు ఎత్తులో 57 భవనాల ఇప్పటికే నగరంలో దర్శనమిస్తున్నాయి. నిర్మాణ దశలో ఇలాంటి భవనాలు మరో 50కి పైగానే ఉన్నాయి. ముఖ్యంగా 59 అంతస్తులు (235 మీటర్లు) కోసం ఒక ప్రతిపాదన ఉండగా, 40-55 అంతస్తుల కోసం దాదాపు 30కి పైగా ప్రతిపాదనలు ఉన్నాయి.