శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 29: సాఫ్ట్వేర్ రంగంలో దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు ప్రత్యేక స్థానం సంపాదించాయని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. శుక్రవారం శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఫిక్కీ మహిళా విభాగం (ఎఫ్ఎల్వో) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గడ్కరి మాట్లాడుతూ.. ఈ రెండు నగరాలను ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు దగ్గరగా గమనిస్తున్నాయని, ఇక్కడి అభివృద్ధిని అడిగి తెలుసుకుంటున్నాయని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో పలు ప్రత్యేకతలు ఉన్నాయని, బిర్యానీతోపాటు వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేయడానికి దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారని ఈ సందర్భంగా గడ్కరీ తెలిపారు. మా కుటుంబ సభ్యులు సైతం ఇక్కడి వస్తువులు కావాలని ఇప్పటికీ అడుగుతుంటారని గుర్తుచేశారు. తయారు చేసే వస్తువులు నాణ్యమైనవిగా ఉంటే మార్కెటింగ్ చక్కగా ఉంటుందంటూ హైదరాబాదీ మార్కెట్‌కున్న డిమాండ్‌ను కొనియాడారు.
మహిళలు పారిశ్రామిక రంగంలో రాణిస్తేనే దేశం అర్థికంగా అభివృద్ధి చెందుతుందని, ప్రతికూల భావాలను దరిచేరకుండా అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా గడ్కరీ పిలుపునిచ్చారు. ఇక వ్యర్థాలనే సంపదగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న గడ్కరీ.. పెట్రోల్ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టేలా అలోచిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తు ఇంధన వనరుగా గ్రీన్ హైడ్రోజన్ మారనుందన్నారు. ఈ సదస్సులో ఎఫ్ఎల్వో హైదరాబాద్ చాప్టర్ ప్రధాన కార్యదర్శి శుభ్ర మహేశ్వరి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రి వికే సింగ్ పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.