రాళ్లు రప్పలతో నిండిపోయిన పరిసరాలు.. ఎక్కడ చూసినా చెత్తా చెదారం.. రాత్రియిందంటే తాగుబోతుల తిష్ట..రెండేళ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని గ్రీన్‌బెల్ట్ పార్క్ దుస్థితి ఇది. ఇలాంటి పార్క్‌ను పచ్చదనంతో నింపడంతో పాటు పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు రెండేళ్లుగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి. ఏపుగా పెరిగిన చెట్లు, ఎటుచూసినా ఆకుపచ్చని మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పార్కు హరితమయంగా మారింది. బంజారాహిల్స్,ఫిబ్రవరి 11
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రెండేళ్ల క్రితం పార్కును సందర్శించడంతో పాటు దీని అభివృద్ధి కోసం కృషి చేశారు. దీంతో పాటు స్థానికుల చొరవతో మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఈ పార్కును అభివృద్ధి చేయడానికి మరింత ముందుకొచ్చారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూలిన ప్రహరీ గోడలను పునరుద్ధ్దరించడంతో పాటు చెతా ్తచెదారం, వ్యర్థాలు వేయకుండా చర్యలు చేపట్టారు. అనంతరం జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగానికి పార్కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో గత రెండేళ్లుగా వేలాది మొక్కలను ఈ పార్కులో నాటారు. ఎక్కడ చూసినా పచ్చదనంతో పార్కులో హరిత కళ వెల్లివిరుస్తోంది. దీనికి తోడు పార్కులో వాకర్ల కోసం వాకింగ్ ట్రాక్‌ను, కూర్చునేందుకు కొత్తగా బెంచీలను ఏర్పాటు చేశారు.
వ్యర్థాలతో పాటు చెత్తాచెదారంతో నిండిపోయిన గ్రీన్‌బెల్ట్ పార్కును అభివృద్ధి చేయాలంటూ స్థానికుల కోరిక మేరకు పనులు ప్రారంభించడం జరిగింది. పార్కు చుట్టూ ప్రహరీ నిర్మాణం చేసిన తర్వాత వేలాది మొక్కలు నాటాం. పార్కులో మొక్కల సంరక్షణ కోసం సిబ్బందిని నియమించడంతో ప్రస్తుతం పచ్చదనంతో నిండిపోయి ఆహ్లాదాన్ని పంచుతోంది. కాలనీవాసులందరూ పార్కు అభివృద్ధి సహకరిస్తున్నారు.
-బాలయ్య, మేనేజర్ , జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం