మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, భవన యజమాని, బిల్డర్ల ధనాశ వెరసి కార్మికుల ప్రాణాలు బలయ్యాయి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకున్న భవన ప్రమాదం అక్రమ నిర్మాణాల విచ్చలవిడితనానికి అద్దం పడుతున్నది. కేవలం 45 గజాల విస్తీర్ణంలో పునాది బలం లేకుండా నిర్మించిన ఏడంతస్తుల అక్రమ కట్టడం పేకమేడలా కూలిపోవడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్ కార్మికులు ఉమేశ్ కారే (34), మహబూబ్ మోపత్ (42) ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణం పూర్తయి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధ్దంగా ఉన్న ఈ భవనం మధ్యాహ్నం కూలిపోవడంతో పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై శిథిలాలు పడడంతో మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను వేగిరం చేశాయి. ఈ ఘటనపై నిర్మాణానికి సంబంధించి అనుమతులు, భవన యజమాని, బిల్డర్ పాత్ర, నిర్మాణ నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బిల్డర్ సాజిద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
– సిటీబ్యూరో/కొండాపూర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక శాఖ, పోలీసులు, సీఎంసీ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద స్థలాన్ని సీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, స్థానిక ఎమ్మెల్యే గాంధీ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
సిటీబ్యూరో/కొండాపూర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : శేరిలింగంపల్లిలోని అంజయ్యనగర్‌లో సాజిద్ అనే బిల్డింగ్ యజమానికి సంబంధించి 45 గజాల స్థలంలో ఏడంతస్తుల భవన నిర్మాణం తుది దశకు చేరుకుని ఎలక్ట్రికల్, టైల్స్ పనులు జరుగుతుండగా, ఒక్కసారిగా భవనం కూప్పకూలింది. పక్కనే నాలా ఉండటం, అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకరస్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం జరుపుతున్నారని మున్సిపల్ అధికారులకు జూన్‌లో స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు నాలుగు నెలల పాటు నిర్మాణ పనులను నిలిపివేయగా.. ఇటీవల బిల్డర్ టైల్స్ పనులను మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులతో చేయిస్తున్నాడు. నాలుగో అంతస్తులో కార్మికులు పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భవనం కూప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకుని సదరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు అడ్డుకోలేదన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా తలెత్తుతున్నాయి. నిర్మాణ నాణ్యత, అనుమతులు, భవన భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటన జరిగేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అక్రమ నిర్మాణదారులకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైనా భవనం కూలినప్పుడు అధికారులు హడావుడిగా తనిఖీలు చేయడం, సీజ్ చేయడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు చేపడుతున్నారని.. ఆ తర్వాత కొద్దిరోజులకే పరిస్థితి మళ్లీ యథావిధిగా మారుతున్నదని స్థానికులు మండిపడుతున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో భవనం కూలిన ఘటన జరిగినప్పటికీ అక్రమ నిర్మాణాల విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మరోసారి ఇలాంటి ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాల వెనుక ప్రధానంగా డబ్బే పరమావధి. యజమానులకు అద్దే ఆదాయం. బిల్డర్లకు నిర్మాణ వ్యాపారం. కానీ ఆ నిర్మాణాల్లో పనిచేసే పేద కూలీల ప్రాణాలకు మాత్రం భద్రత లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొకి నిర్మాణాలు చేపట్టినప్పుడు చివరికి దాని పర్యవసానం ఎదురొనేది అమాయక కార్మికుల కుటుంబాలేనని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. రెకాడితే గానీ డొకాడని కూలీలు తమ కుటుంబాలను పోషించేందుకు పనికి వస్తే.. అక్రమ నిర్మాణాల పుణ్యమా అని వారి ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయని బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.
ఒకవైపు అక్రమ నిర్మాణదారులు నిబంధనలను తుంగలో తొకుతుంటే.. మరోవైపు వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముందస్తు ఫిర్యాదులు ఉన్నప్పటికీ చర్యలెందుకు తీసుకోలేదు? 45 గజాల్లో ఏడంతస్తుల నిర్మాణానికి ఎవరి అండ ఉంది? అనుమతుల్లేకుంటే నిర్మాణం ఇంత దూరం ఎలా వచ్చింది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నాలాపై నిర్మాణం, నిర్మాణంలో సరైన నిబంధనలు పాటించని కారణంగానే కూలినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ భవన ఘటనను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే అమాయకపు కూలీలు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి కావన్నారు. కాసుల కకుర్తికి అలవాటుపడ్డ అధికారులు ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.
మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 178లో పొందుపరిచిన మార్గనిర్దేశక సూత్రాలను జోనల్ కమిషనర్లు బేఖాతరు చేస్తున్నారు. బిల్డ్ నౌ చట్టంలోని 3(2)లోని నియమావళి ప్రకారం.. జోనల్ పరిధిలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంలకు జోనల్ కమిషనర్ నేతృత్వం వహించడం, జోనల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ గత కమిషనర్ లోకేశ్‌కుమార్ టీఎస్ బీపాస్ చట్టం-2020లోని సెక్షన్ 28(1) ద్వారా సంక్రమించిన అధికారాలు, నియమాలు జీవో నం.200లోని సూత్రాలను అనుసరిస్తూ జోనల్ పరిధిలోని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంలను, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేస్తూ 3-3-2020న ఆరు జోన్లకు 6 మంది నోడల్ అధికారులు 24 మందితో 12 ఎన్ఫోర్స్మెంట్ బృందాలను, సర్కిళ్లలోని వార్డుల ప్రకారంగా 84 మంది న్యాక్ ఇంజినీర్లతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు.
ఈ టీంలు అక్రమ కట్టడాల కూల్చివేత, జరిమానాలు, సీజ్ చేయడం, పంచానామా వంటివి నిర్వర్తించాలని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. కానీ ఎస్టీఎఫ్ల లక్ష్యాలు పక్కదారి పట్టాయి. అవినీతికి అలవాటు పడిన కొందరు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా అనధికారిక నిర్మాణాలకు అనుమతినివ్వడంతో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీనిపై కమిషనర్ సృజన దృష్టి సారించి ఎస్టీఎఫ్‌ను సమూల ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలడంతో పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్ పాక్షికంగా దెబ్బతింది. ఈ సందర్భంగా రమణారెడ్డి, సంయుక్తలకు గాయాలయ్యాయి. వీరిని పోలీసులు కేర్ హాస్పిటల్లకు పంపించి వైద్యం అందిస్తున్నారు. అయితే గోడలు ధ్వంసం కావడంతో అందులో ఉన్న వారిని పోలీసులు బయటకు పంపించారు. పెద్ద శబ్దం రావడంతో కిందకు వెళ్లాం..అప్పటికే భవనం కూలిపోయింది. తిరిగివచ్చే సరికి మా బెడ్రూమ్ ధ్వంసమై ఉంది. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాం అని పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాసి ఉమా మహేశ్ తెలిపారు.
– ఉమా మహేశ్ పక్క అపార్ట్మెంట్ వాసి