సైదాబాద్, ఏప్రిల్ 1 : డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ అన్నారు. శుక్రవారం ఏకలవ్యనగర్, రెడ్డి బస్తీ, ఎరుకల బస్తీల్లో డ్రైనేజీ వ్యవస్థను కార్పొరేటర్ జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సైదాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న మ్యాన్‌హోళ్ల మూలంగా తరుచూ డ్రైనేజీ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు సకాలంలో చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సైదాబాద్ జలమండలి మేనేజర్ శ్రవణ్‌కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మనోహర్ పాల్గొన్నారు.
టీబీ దవాఖాన సబ్‌స్టేషన్ కేబుల్ పనులు ప్రారంభం
చాదర్‌ఘాట్, ఏప్రిల్ 1 : ఆజంపురా డివిజన్లోని టీబీ దవాఖాన వద్ద నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు కేబుల్ లైన్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. టీబీ దవాఖాన నుంచి డబీర్‌పురా దర్వాజా వరకు కేబుల్ లైన్ కోసం విద్యుత్ శాఖ అధికారులు పనులు చేస్తున్నారు. శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు, ఎంఐఎం నాయకులతో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్ షేక్ మొహియుద్దీన్ అబ్రార్ మాట్లాడుతూ.. పనులకు విధాల సహకరిస్తామన్నారు. సబ్‌స్టేషన్ ఏర్పాటుతో నియోజకవర్గం పరిధిలో కరెంట్ కష్టాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.