ఖైరతాబాద్, మార్చి 30 : పంజాగుట్టలోని ఏ కూడలి చూసినా ఇరుకుగా, ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉంటుంది. ప్రధానంగా జంక్షన్ల వద్ద ఈ సమస్య అధికంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తీరేలా….వాహనదారులు, పాదచారులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన దారిని కల్పించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోనప్ప, పంజాగుట్ట, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్లు నిత్యం ట్రాఫిక్‌తో అవస్థలు పడాల్సి వస్తోంది. వాహనాల రాకపోకలు, క్రమబద్ధీకరణ కోసం ట్రాఫిక్ పోలీసులు నిత్యం శ్రమించాల్సి వస్తుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమస్యను కాస్త తగ్గించినా, ప్రయాణం సాఫిగా సాగేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది.
విస్తరించనున్న రోడ్లు….జంక్షన్లు
పంజాగుట్ట-మెహిదీపట్నం, అమీర్‌పేట-ఎర్రమంజిల్, మెహిదీపట్నం-పంజాగుట్ట-సికింద్రాబాద్ ప్రధాన రహదారులు ఇరుకుగా ఉన్నాయి. దీంతో జంక్షన్ సమీపంలోకి రాగానే నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఈ రోడ్లను విస్తరించాల్సి ఉంటుంది. వీటితో పాటు జంక్షన్లను సైతం సుందరీకరించి, బోలార్డ్, ఐల్యాండ్స్ ఏర్పాటు చేస్తే వాహనదారులు, పాదచారులకు ట్రాఫిక్ ఇక్కట్లు పూర్తిగా తప్పుతాయి. ఈ నేపథ్యంలో పంజాగుట్ట, మోనప్ప, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ల అభివృద్ధితో పాటు విస్తరణ చేసేందుకు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధ్దం చేస్తున్నది.
సంయుక్తంగా సమాలోచన
ట్రై జంక్షన్ల విస్తరణ, అభివృద్ధిపై ఇటీవల ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్, సీఐ మధుసూదన్, జీహెచ్ఎంసీ ఎస్ఈ రత్నాకర్, ఈఈ ఇంద్రజ, డీఈ చైతన్య, ఏఈ చరణ్, శ్రీనివాస్, బెంగళూరుకు చెందిన జనగ్రహ అర్బన్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి ఆయా జంక్షన్లను పరిశీలించారు. సాధ్యాసాధ్యాలపై చర్చించారు. మూడు జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ బాధ్యతను జనగ్రహ అర్బన్ కన్సల్టెన్సీ ఏజెన్సీకి అప్పగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు వారు సిద్ధం చేసిన ప్రణాళికను ఎంపిక చేసి వాటి రూపకల్పన కోసం నిధులు మంజూరు చేస్తారు. ముందుగా పంజాగుట్ట జంక్షన్‌ను ఫైలెట్ ప్రాజెక్టుగా చేపడుతామని, ఆ తర్వాత వెనువెంటనే మిగతా కూడళ్లలో కూడా సుందరీకరణ పనుల చేపడుతామని, జనగ్రహ ఏజెన్సీ ప్రాజెక్టు డిజైన్‌ను రెండు వారాల్లో సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
– చైతన్య, జీహెచ్ఎంసీ డీఈ