ఎర్రగడ్డ, మార్చి 30: ఎర్రగడ్డ డివిజన్ సారథినగర్‌లో ఎమ్మెల్యే గోపీనాథ్ బల్దియా జోనల్ కమిషనర్ ప్రియాంకతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఎమ్మెల్యే గోపీనాథ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈయన ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ రమేశ్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఎమ్మెల్యేతో పాటు పర్యటనలో పాల్గొన్నారు. సారథినగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో ఇటీవల ప్రైవేటు వ్యక్తులు బోరును ఏర్పాటు చేసుకోవటం వివాదాస్పద అంశంగా మారింది.
ఈ బోరును గమనించిన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాల ను ఇష్టానుసారంగా వాడుకోవటం.. ఆక్రమించటం పట్ల ఉదాసీనత ఎందుకు అంటూ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.అదే విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. అతి తక్కువ స్థలాల్లో ఐదారంతస్తుల నిర్మాణాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయని.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని గోపీనాథ్ హెచ్చరించారు.
సారథినగర్‌లో చోటు చేసుకున్న అక్రమాలపై త్వరలో జోనల్ కమిషనర్‌తో సమావేశమై కఠిన చర్యలు తీసుకునే విధంగా చేస్తామని పేర్కొన్నారు. పర్యటన సందర్భంగాఎస్సార్నగర్ పోలీ స్ ఇన్స్పెక్టర్ సైదులు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, సీనియర్ నేతలు పల్లవియాదవ్, మల్లేశ్, రాము, మహ్మద్‌అహ్మద్, కల్యాణి, అజీమ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.