మణికొండ, మార్చి 30: తెలంగాణ సర్కారు కృషితో వేసవిలోనూ విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ సరఫరాలో ఏ మాత్రం అంతరాయం కలుగకుండా అధికారులు అన్ని విధాలా చర్యలు చేపడుతున్నారు.మణికొండ/ఇబ్రహీంబాగ్ డీఈ కార్యాలయం పరిధిలో సాధారణ సమయాల్లో 35-40 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కాగా ప్రస్తుతం 45-65 మెగావాట్లకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఇందుకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు.రంజాన్ మాసం కూడా వస్తుండటంతో అధికారులు విద్యుత్ సరఫరా విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
అందుబాటులోనాలుగు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు
వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే అప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టేందుకు ఏడు మొబై ల్ ట్రాన్స్ఫార్మర్లను అధికారులు అందుబాటులో ఉంచా రు. మణికొండ, నార్సింగి సబ్ డివిజన్లలో నాలుగు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉంచారు.
అత్యవసర సమయంలో ఎఫ్ఓసీలు
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన సమయంలో నేరుగా ఫ్యూజ్ ఆఫ్ కాల్(ఎఫ్ఓసీ) నంబర్‌కు ఫోన్ చేస్తే సమయానికి ప్రత్యేక బృందాలు ఆ ప్రాంతానికి వచ్చి సమస్యలను పరిష్కరిస్తారు. ప్రధానంగా నార్సింగి, మణికొండ, సబ్‌స్టేషన్ పరిధిలో ఎఫ్ఓసీ బృందాలు చాలా యాక్టివ్‌గా పనులు చేస్తున్నారని వినియోగదారులు అంటున్నారు. ఎఫ్ఓసీ ఫోన్‌నంబర్లు 9491292118 (నార్సింగి),9493193119(మణికొండ)విద్యుత్ అంతరాయ సమస్యలను ఈ బృందాలు పనిచేస్తాయి.
విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు
వేసవిలోవిద్యుత్ సమస్య తలెత్తకుండాఅన్ని ఏర్పాట్లు చేపట్టాం. ఇప్పటికే విద్యుత్ ఫీడర్లకు మరమ్మతులు చేశాం.ఎఫ్ఓసీలలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. దీనికి తోడు విద్యుత్ ఏడీఈ, ఏఈలను కూడా అందుబాటులో ఉంచాం. రెండు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచాం.అవసరమైన చోట ఇప్పటికే సబ్స్టేషన్లను ఏర్పాటు చేశాం.
-డీఈ శివశంకర్