సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ‘ఉస్మానియా తక్ష్ 2022’ వేడుకలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికైంది. ఇందులో భాగంగా పరిశోధనలు, అద్భుత ఆవిష్కరణలు, నమూనాల రూపకల్పనతో ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యం ఉట్టిపడింది. ‘కనెక్ట్ అండ్ రీ-కనెక్ట్ టు గ్రో’ ట్యాగ్ లైన్తో గురువారం ఉత్సవాలను ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ప్రారంభించారు. చారిత్రక 104 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసమే ఓపెన్ డే వేడుకలను నిర్వహిస్తున్నట్లు వీసీ వెల్లడించారు. వర్సిటీ సాధించిన అంశాలను విస్తృతంగా వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఆయా విభాగాల అధికారులు తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలు పాఠశాలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్లు, పలు కళాశాలలకు వైద్యవిద్యార్థులు హాజరై పలు అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల్లో తక్ష్-2022 వేడుకలను వీసీ ప్రారంభిస్తూ.. విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్లన్ని కలియదిరిగారు. ఆర్ట్స్, సైన్స్, లా, ఇంజినీరింగ్, కళాశాలల అన్ని విభాగాల్లో ఓపెన్డే కార్యక్రమాన్ని నిర్వహించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ డి.రెడ్యానాయక్, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్, అధిపతులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
చరిత్రలో బాహుబలి సినిమా…
అనేక అంశాలను విద్యార్థులు రూపొందించి నమూనాలను ప్రదర్శించారు. అజాత శత్రువు హయాంలో రూపొందించిన యుద్ధరంగంలో వాడిన ఆయుధాలనే రాజమౌళి బాహుబలి సినిమాలో చూపారని మంజు భార్గవి అనే చరిత్ర విద్యార్థిని పేర్కొన్నది. తాను రూపొందించిన ఆయుధ సంపత్తిని ఓపెన్ డేలో ప్రదర్శించడంతో అందరూ అప్పటి కళనే ఇప్పుడు సినిమాలో చూశామా.. అంటూ ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారని తెలిపారు. సింధూ నాగరికత, నిజాం విధానాలు తదితర అంశాలను ప్రదర్శించారు.
ఆకట్టుకున్న జర్నలిజం విభాగం
పలు అంశాలతో జర్నలిజం విభాగం ఆకట్టుకున్నది. 1954లో ఏర్పాటైన ఈ విభాగం నేటి వరకు తాను రూపొందించిన అంశాలను ప్రదర్శనలో ఉంచింది. జర్నలిజం విద్యార్థి సంతోష్ ఈస్రమ్ తీసిన ఫొటో గ్యాలరీ ఎంతో ఆకట్టుకున్నది. పల్లె బతుకులు, జీవన చిత్రాలు ఆలోచింపజేశాయి. మూవీ కార్నర్లో ఆయా రంగాల్లో మొట్టమొదటగా సాధించిన అంశాలను క్రోడీకరించి ప్రదర్శించారు. దీంతో పాటు వీడియో, లైబ్రరీలో పుస్తక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
అత్యాధునిక సాంకేతికత.. 3డీ ప్రింటింగ్
3డీ ప్రింటింగ్ అత్యాధునిక సాంకేతికతతో మానవ జీవన వికాసానికి ఎంతో తోడ్పాటునందిస్తున్నదని, శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే గాకుండా వైద్య విభాగం (బయో మెడికల్)లో ఎంతో ఖచ్చితమైన విధానంతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నదని రీసెర్చ్స్కాలర్ సిద్ధార్థ చందర్ పేర్కొన్నారు. త్రీడీ క్లిష్టతరమైన అంశాలను సులభతరం చేసిందన్నారు. ఫిలమెంట్, పౌడర్, లిక్విడ్ లాంటి మెకానిజంతో రూపొందించిన అంశాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
ఆకట్టుకున్న రాక్ గార్డెన్, పురాతన శిలాజ మ్యూజియం
భూ విజ్ఞాన శాస్త్రం (జియాలజీ) ఆవరణ ఓపెన్ డే సందర్భంగా సందర్శకులతో సందడిగా మారింది. 1959లో ప్రారంభించిన ఈ విభాగంలోని శిలాజ శిలలు, ధాతువులు, శిలాజాల నమూనాలతో నిండిన భూవిజ్ఞాన శాస్త్ర మ్యూజియంను గురువారం సుమారు 1000 మంది సందర్శించారని ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రభాకర్ తెలిపారు.
ఉపాధ్యాయులే మూలస్తంభాలు:ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉదయం 11 గంటలకు జరిగిన ఓపెన్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్, యూజీసీ డీన్ ఎఫైర్స్ మల్లేశం హాజరై పారంభించారు. వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులే సమాజానికి మూలస్తంభాలని, విద్య ద్వారానే మానవ మనుగడ సాధ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోరటికి ఆత్మీయ సన్మానం చేశారు.
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ..
ఎన్విరాన్మెంటల్ సైన్స్ కళాశాలలో కోఆర్డినేటర్ డాక్టర్ కె.శైలజ ఆధ్వర్యంలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జలసంరక్షణ, ప్రత్యామ్నాయ ఇంధనం తదితర అంశాలపై పలు నమూనాలను రూపొందించారు. వైష్ణవి, గణేశ్ రూపొందించిన ‘కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ స్టోరేజ్’ ప్రాజెక్టు అందరినీ ఆకట్టుకున్నది.