మహేశ్వరం, మార్చి 24: గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి పేదలను నట్టేట ముంచుతున్న కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రైతుల పక్షాన మరో ఉద్యమం మొదలైందని, ప్రజల ఉద్యమాలకు కేంద్రం దిగివచ్చి తెలంగాణలో రైతులు పండించిన వరిధాన్యాన్ని మొత్తం కొనాల్సిందేనని అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డితో కలిసి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణను నిలుపుతున్నారని అన్నారు. మత కలహాలను సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి పేదలను నట్టేట ముంచుతున్నదని మండిపడ్డారు. సబ్సిడీలను ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకున్నదని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు ఒక్క రూపాయి మాఫీ చేయని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.11 లక్షల కోట్లు మాఫీ చేసిందని తెలిపారు. తెలంగాణపై కక్ష్య సాధింపు ధోరణిని వీడి రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తూనే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం చౌరస్తాలో గ్యాస్ సిలిండర్‌తో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పాండురంగారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, మహేశ్వరం మండల పార్టీ అధ్యక్షులు అంగోతు రాజునాయక్, వైస్ ఎంపీపీ సునితాఆంధ్యానాయక్, మీర్పేట్ మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బేరబాలకిషన్, సహకారబ్యాంక్ చైర్మన్ మంచెపాండుయాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూనయాదయ్య, మండల రైతు సమన్వయ సమితి నాయకులు రాఘవేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి, కోప్షన్ సభ్యులు ఆదిల్‌అలీ పాల్గొన్నారు.