సిటీబ్యూరో, మార్చి 24(నమస్తే తెలంగాణ)/మాదాపూర్: మహా నగరంలో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్న ట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. శేరి లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజల సౌకర్యం కోసం చందానగర్ మదీనాగూడ, దీప్తిశ్రీనగర్, పీజేఆర్ ఎన్క్లేవ్ వద్ద రూ.10.70 కో ట్ల వ్యయంతో చేపట్టిన రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను శేరి లింగంపల్లి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీతో కలిసి మేయర్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి విశేష కృషి చేస్తున్నారని మేయర్ వివరించారు. హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
ఈ సందర్భంగా మేయర్ ఈరాల చెరువు నుంచి జాతీయ రహదారి 65 వరకు రూ.15.88 కోట్ల వ్య యంతో చేపట్టిన పనులను పరిశీలించారు. నిర్దేశించిన కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని మేయర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వరదలకు గతంలో పలు కాలనీలలో పడిన ఇబ్బందులు అధిగమించేందుకు శాశ్వత పరిషారం కోసం రూ.858 కోట్ల వ్యయంతో 60 నాలాల అభివృద్ధి పనులను వచ్చే వర్షాకాలం లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు మేయర్ విజయలక్ష్మి అన్నారు. నగరంలో 4 ప్యాకేజీలో రూ. 127 కోట్ల 35 లక్షల వ్యయంతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఈఈ శ్రీకాంత్, చీఫ్ ఇంజనీర్ వసంత, హఫీజ్ పేట్, చందానగర్ 110 వార్డు మెంబర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడే ఎక్కువ అభివృద్ధి
నియోజకవర్గ అభివృద్ధిలో సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సహకారం ఎంతో ఉంది. అన్ని నియోజకవర్గాల కంటే ఇకడే ఎకువగా అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గంలో తాగునీటి పనులు పూర్తయ్యాయి. కాగా, సీవరేజ్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. అభివృద్ధికి నగర మేయర్, కమిషనర్ ఎంతగానో సహకరిస్తున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి వలన ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరింది. ఇది ప్రమాదాలకు అడ్డుకట్ట వేసింది. సీనియర్ సిటిజన్, దివ్యాంగుల కోసం లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ పనులు కూడా త్వరలో పూర్తి అవుతాయి.
– అరెకెపూడి గాంధీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్