మన్సూరాబాద్, మార్చి 24: ఓ రౌడీషీటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన విభేదాలే హత్యకు కారణమని విచారణలో తేలింది. హత్యకు కారకులైన ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ కేసు వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, షాహీన్‌నగర్‌కు చెందిన ఇలియాస్ నవాబ్ (32) రౌడీషీటర్.
అలాగే సలాలకు చెందిన మరో రౌడీషీటర్ సలేహ్బిన్ హఫీజ్ మహరూజ్ (24)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. అయితే హఫీజ్‌కు తెలియకుండా నవాబ్ భూ లావాదేవీలు జరుపడంతో వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. మరోవైపు నవాబ్ చాంద్రాయణాగుట్ట పరిధిలో ఓ ప్లాట్‌ను ఆక్రమించుకొని.. సీసీ కెమెరాలు పెట్టగా, వాటిని ఎవరో అపహరించుపోయారు. ఈ పని హఫీజే చేసి ఉంటాడని..భావించి.. అతడికి ఫోన్ చేసి..చంపుతానని బెదిరించాడు. ఇలా ఇద్దరి మధ్య కక్షలు పెరిగిపోయాయి.
ఎలాగైనా ఇలియాస్ నవాబ్‌ను అంతమొందించాలని ప్లాన్ వేసిన సలేహ్బిన్ హఫీజ్ మహరూజ్ విషయాన్ని అబుబాకర్ బిన్ హఫీజ్ (21), ఇస్మాయిల్ బిన్ అబ్దుల్ అజీజ్ (19), రౌడీషీటర్ జాఫర్బిన్ హవాలీ (32), బాబర్ హమ్దీ (24) షేక్ మజీద్అల్ హసన్ (21), మునసిర్ అమీర్ బరసిత్ (20)కు చెప్పాడు. ఈనెల 20న రాత్రి 9 గంటల సమయంలో ఇలియాస్ నవాబ్ తన వాటర్ ప్లాంట్ వద్దకు వస్తుండగా, మాటు వేసిన వీరంతా కత్తులతో దాడికి పాల్పడి పరారయ్యారు. నవాబ్‌ను అతడి మిత్రుడు సమీపంలోని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి..వారి నుంచి ఎనిమిది సెల్ఫోన్లు, 4 బైకులు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.