పెను విషాదం.. మాటలకందని దారుణం.. వలస కుటుంబాల్లో తీరని దుఃఖం.. పొద్దంతా శ్రమించిన యువకులు గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా మంటలు.. ప్రాణాలు కాపాడుకుందామనే లోపే అగ్గికి బుగ్గయ్యారు. సికింద్రాబాద్ బోయిగూడ తుక్కు గోదాం (స్క్రాప్ గోడౌన్)లో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనం కాగా, మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పొట్టచేతపట్టుకొని బిహార్ నుంచి నగరానికి వలసొచ్చిన వారి జీవితం అర్ద్ధంతరంగా ముగిసిపోయింది. మృతిచెందిన వారంతా 21 నుంచి 40 ఏండ్లలోపు వారే. గతవారం హోలీ సంబురాలు చేసుకున్న వీరంతా ఉగాదికి సొంతూళ్లకు వెళుదామనుకునేలోపే విషాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే పోలీసులు, అగ్నిమాపక, బల్దియా, వైద్య సిబ్బంది స్పందించి సేవలందించారు.
సిటీబ్యూరో/ సికింద్రాబాద్/మారేడ్‌పల్లి / ముషీరాబాద్/ మెహిదీపట్నం/ మార్చి 23 (నమస్తే తెలంగాణ) : కాసేపట్లో నిద్రలేవాల్సిన వాళ్లు… కళ్లు మంటలెక్కించే పొగలో, మంటల్లో చిక్కుకుపోయారు. బయటికి వెళ్లే దారిలేక, ఉన్నా కానరాక… ఉక్కిరి బిక్కిరై ఊపిరి వదిలేశారు. దట్టంగా అలుముకున్న పొగ..అక్కడ కార్భన్ మోనాక్సైడ్ పరిమాణం భారీగా ఉండడంతో ఊపిరాడక చనిపోయారు. ఒకరూ ఇద్దరూ కాదు… ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మాత్రం స్క్రాప్ గోదాం నుంచి దూకి ప్రాణాలను దక్కించుకున్నాడు. చనిపోయిన వారంత 21 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న వారే . నగరంలోని బోయిగూడలో జరిగిన ఈ దుర్ఘటన అందరినీ గుండెల్ని పిండేసింది.
ఉపాధికొస్తే ఊపిరిపోయింది..
అది బోయిగూడ కట్టెలమండి..చుట్టూ దాదాపు 15 వరకు టింబర్ డిపోలు. సుమారు నాలుగు స్క్రాప్ గోదాములు. జనవాసాల్లోని తాత్కాలికమైన రేకుల షెడ్డు గోదాం. దిల్‌షుఖ్‌నగర్ సరూర్‌నగర్‌కు చెందిన డోకి సంపత్‌కుమార్ అనే వ్యక్తికి చెందిన శ్రవణ్ స్క్రాప్ ట్రెడర్స్ పేరిట తుక్కు గోడౌన్ (స్క్రాప్)లో రెండేళ్లుగా వీరంతా (బీహార్‌కు చెందిన కార్మికులు) పనిచేస్తున్నారు. ఈ గోదాంలో రెండేళ్ల క్రితం తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన వ్యక్తులే పనిచేశారు. లాక్డౌన్ తర్వాత వలస వెళ్లిన బీహార్వాసులంతా తిరిగి నగరానికి చేరుకుని సంపత్‌కుమార్‌ను ఆశ్రయించగా 12 మందికి ఉపాధి కల్పించారు. వాడేసిన మద్యం బాటిళ్లు, పాత పేపర్లు, కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువులను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఈ గోడౌన్లో భద్రపరుస్తారు. ఈ గోడౌన్లో చెత్తను వేరు చేసి, ప్యాకింగ్ చేసి లారీలలో ఇక్కడి నుంచి తరలిస్తారు. ఒక్కో కార్మికుడికి రూ. 600ల చొప్పున ఇస్తూనే, లారీ లోడ్, అన్లోడ్ సమయంలో ఒక ట్రిప్పుకు రూ. 3వేలు వస్తాయి. ఈ నగదును అందరూ కలిసి పంచుకుంటారు. ఈ కూలీలకు గోడౌన్ యజమాని వారం వారం పేమెంట్ ఇస్తారు.
ప్రముఖుల సందర్శన
బోయిగూడ గోదాములో అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. మృతుల బంధువులు, బిహార్ రాష్ట్రంలోని వారి స్వస్థలానికి చెందిన వారితో మాట్లాడి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్ గాంధీ దవాఖానలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పండక్కి ఊరెళ్దామనుకుంటే..
కన్న వారిని, ఉన్న ఊరును విడిచి నగరానికి బతుకుదెరువు కోసం వచ్చారు. పొట్టకూటి కోసం తోచిన పనిలో చేరారు. వచ్చిన జీతాన్ని పోగుచేసుకుని వచ్చే ఉగాదికి ఊరు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. గత వారమే అంబర్‌పేటలో ఉండే మిత్రుడు శంకర్ వద్దకు వెళ్లి హోలీ సంబురాలు చేసుకున్నారు. మంగళవారం రాత్రి యథావిధిగా భోజనాలు ముగించుకుని నిద్రపోయిన వీరిని అగ్నిప్రమాదం కబళించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తెచ్చారు. ఒకేసారి 11 మంది కార్మికులు అగ్నికి ఆహుతవడంతో బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి.
4 గంటల శ్రమ.. అదుపులోకి మంటలు
బోయిగూడలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో నాలుగు గంటల పాటు శ్రమిస్తే మంటలు అదుపులోకి వచ్చాయని హైదరాబాద్ సెంట్రల్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ వి.పాపయ్య స్పష్టం చేశారు. తెల్లవారుజామున 3.54 గంటలకు ఈ అగ్ని ప్రమాద ఘటనపై మొదటి ఫోన్ కాల్ అందుకున్నామని, వెంటనే సమీపంలోని గాంధీ ఆసుపత్రి ఫైర్ అవుట్‌పోస్టులోని వాటర్ బ్రౌజర్ వాహనం అక్కడికి వెళ్లిందని చెప్పారు. ఆ తర్వాత ముషీరాబాద్, సికింద్రాబాద్, గౌలిగూడ, మౌలాలి, అసెంబ్లీ ప్రాంతాల నుంచి మరో ఏడు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయని చెప్పారు. అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది 4 గంటల పాటు తీవ్రంగా శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయని, ఆ తర్వాతనే గోడౌన్లో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను బయటికి తీసినట్లు పాపయ్య తెలిపారు.
గోడౌన్ యజమానిపై కేసు నమోదు
పోలీసులకు మృత్యుంజయుడు ప్రేమ్‌కుమార్ ఫిర్యాదు
11 మంది సజీవదహనానికి గోడౌన్ యజమాని సంపత్‌కుమార్ నిర్లక్ష్యమే కారణమని మృత్యుంజయుడు ప్రేమ్‌కుమార్ పోలీసులకు తెలిపారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న వలస కార్మికుడు ప్రేమ్‌కుమార్ నుంచి గాంధీనగర్ పోలీసులు వివరాలు, ఫిర్యాదు తీసుకున్నారు. గోడౌన్ యజమాని భద్రతాచర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రేమ్ స్పష్టం చేశారు. ‘మొత్తం 12మందిమి శ్రావణ్ స్క్రాబ్ ట్రేడర్స్‌లో పని చేస్తాం. మంగళవారం రాత్రి 9గంటల వరకు పని చేసి భోజనం చేశాక మొదటి అంతస్తులో పడుకున్నాం. నేను, బిట్టు, అంకజ్ ఒక గదిలో నిద్రించగా… మిగిలిన తొమ్మిది మంది మరో గదిలో పడుకున్నారు. తెల్లవారుజామున సుమారు 3గంటల సమయంలో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. గదుల నిండా పొగ నిండుకుంది. వెంటనే మేమంతా తప్పించుకునే ప్రయత్నం చేశాం. నేను కిటికీ నుంచి బయటికి దూకాను. కానీ మిగిలిన వారు రాలేకపోయారు. నన్ను పోలీసులు వెంటనే గాంధీ దవాఖానకు తరలించారు. ఆ తర్వాత నాకు 11 మంది చనిపోయినట్లుగా తెలిసింది…’ అని ప్రేమ్‌కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 304ఎ, 337 సెక్షన్ల కింద కేసు (ఎఫ్ఐఆర్ నెంబరు 110/2022) నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

పలువురి సంతాపం
బోయిగూడ గోదాం అగ్ని ప్రమాద ఘటనపై డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిషాంక్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గోదాములను తనిఖీ చేస్తాం..
అగ్ని ప్రమాదంలో 11మంది చనిపోవడం చాలా బాధాకరం. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందిస్తాం. నగరంలోని గోదాములను తనిఖీ చేసి, అనుమతులు లేని వాటిపై అవసరమైన చర్యలు తీసుకుంటారు.
– మహ్మద్ అలీ, హోంశాఖ మంత్రి
పునరావృతం కాకుండా చర్యలు
అగ్నిప్రమాద ఘటన అత్యంత విచారకరం. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామాలకు తరలిస్తాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఆయా శాఖల అధికారులు విచారణ జరిపి నివేదికలు పంపిన తరువాత అవసరమైన చర్యలు చేపడుతాం.
– సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సమగ్ర విచారణ జరుపుతాం
అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. చనిపోయిన వారంతా బీహార్ రాష్ట్రం చాప్ర జిల్లా నుంచి వచ్చినవారే. మృతులకు 23 నుంచి 35 మధ్య వయస్సు ఉంటుంది. తెల్లవారుజామున 3.30కు దట్టమైన పొగలు రాగా, తరువాత లోపల ఉన్న సిలిండర్ పేలినట్లు తెలుస్తొంది. కింది ఫ్లోర్లో స్క్రాప్ నిల్వ ఉంది. పైన గదిలో లేబర్ నివసిస్తున్నారు. ఇదంతా ఫైర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. నిద్రలోనే యువకులంతా చనిపోయినట్లు స్పష్టమవుతుంది. ఒక్క యువకుడు బతికాడు. అతను కోలుకున్నాక విచారిస్తే మరిన్ని విషయాలు వెల్లడవుతాయి.
– సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్
ఒక వైపే దారి.. అందుకే ప్రాణనష్టం..
స్క్రాప్ గోదాము కింది ఫ్లోర్, మొదటి అంతస్తు మొత్తం కలిసి రేకుల షెడ్‌తో మూసి, గాలి ఆడని పరిస్థితి ఉండటం వల్లనే ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. మెట్ల వద్దనే మంటలు చెలరేగడంతో కార్మికులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎనిమిది ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలను అదపులోకి తెచ్చిన తరువాత వెనక షటర్ తెరిచి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాం. మృతదేహాలు ముట్టుకోవడానికి వీలు లేకుండా కాలిపోయాయి.
– సర్దార్, అగ్నిమాపక శాఖ ఎమర్జెన్సీ అధికారి
నాకు ఏడుపు ఆగలేదు
తెల్లవారుఝామున కట్టెల మండి వద్ద స్క్రాప్ గోదాం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. వెంటనే మేము జై ప్రకాశ్‌నగర్ నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లాం. మంటలు వ్యాపించి పొగ నిండిపోవడంతో లోపల ఏముందో కనిపించలేదు. అప్పటి వరకు అట్ట కాగితాలు మాత్రమే కాలుతున్నాయని అనుకున్నాం. కానీ మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలి 11 మంది సజీవదహనం కావడం కళ్లార చూశాక నాకు ఏడుపు ఆగలేదు. వాటిని తరలించడంలో మేము పోలీసులకు సహకరించాం.