బడంగ్‌పేట, మార్చి 23:‘మేమంతా అభివృద్ధిపై ఆలోచిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నాయి’ అని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జిల్లెలగూడ చల్లాలింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సైతం ‘మన ఊరు-మన బడి’కి సహకరించాలని ప్రవాసీ భారతీయులను కోరినట్లు ఆమె తెలిపారు. ఎక్కడికి వెళ్లినా రాష్ర్టానికి తేవాల్సిన పెట్టుబడులు.. రాష్ర్టాభివృద్ధి కోణంలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు పని చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు.
పాఠశాలలను దేవాలయాలుగా చూసుకోవాలి..
పాఠశాలలను దేవాలయాలుగా చూసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంచాలన్నారు. బాలవికాస్, అమేజాన్ లాంటి సంస్థలు ప్రభుత్వ పాఠశాలలకు సహాయ సహకారాలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, డీఈవో సుసీందర్రావు, ఎంఇఈ కృష్ణయ్య, కార్పొరేటర్ గజ్జల రాంచందర్, ప్రధానోపాధ్యాయురాలు సరళ, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.