ఖైరతాబాద్, మార్చి 23: ‘బహుజన ధూంధాం’ రిథమ్ ఆఫ్ బహుజన్ కల్చర్ వేడుకలను ఏప్రిల్ 24న లలిత కళాతోరణంలో నిర్వహించనున్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ వేడుకలకు సంబంధించిన బ్రోచర్లను ప్రొఫెసర్ రాజునాయక్, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, గాదె వెంకటేశ్, దానబోయిన రవి, రేలారే గంగా, మందాల భాస్కర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ కన్వీనర్ మచ్చ దేవేందర్ మాట్లాడుతూ ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి కవులు, కళాకారులు, వాగ్గేయకారులు తమ గళాన్ని వినిపించారన్నారు. తెలంగాణ బహుజన సంస్కృతిని కాపాడాలని, మహనీయుల ఆలోచనలు, త్యాగాలను ప్రజలకు చేరవేసేందుకు 24న ‘బహుజన ధూంధాం’ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకతీతంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ వాగ్గేయకారులు, పదిహేను కులాలకు చెందిన కళాకారులు హాజరవుతారని తెలిపారు.