సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంతో హైదరాబాద్ మహానగర పరిధిలో 147శాతం అటవీ విస్తీర్ణం పెరిగినట్లు తాజాగా తేల్చారు. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం ఉండగా.. హరిత హారం కార్యక్రమంతో అటవీ విస్తీర్ణం 81.81 చదరపు కిలో మీటర్లకు పెరిగినట్లు ఎఫ్ఎస్ఐ (ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా) ప్రకటించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఐతో పాటు ఆర్బర్ డే ఫౌండేషన్ సంస్థ, ఎఫ్ఏఓ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూఎన్) సంస్థలు 2020 సంవత్సరానికి గాను హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా గుర్తించినట్లు వివరించారు. 63 దేశాలకు చెందిన 119 పట్టణాలు, నగరాలు ఈ పోటీలో పాల్గొనగా, హైదరాబాద్ నగరం ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నారు.
వందలాది ఎకరాల్లో పారుల అభివృద్ధి
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఒక ఎకరం ఖాళీ స్థలం ఉంటే చాలు పారు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. వందలాది ఎకరాల్లో పారులను అభివృద్ధి చేస్తూ సత్ఫలితాలు రాబడుతున్నారు. పారుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించేందుకు పారులు దోహద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కోసం పలు పారుల్లో మినీ ప్లే కోర్టులు అభివృద్ధి చేశారు. సైక్లింగ్‌తో పాటుగా వాలీ బాల్, బాసెట్ బాల్, అడ్వెంచర్ గేమ్స్, సంప్రదాయ, ఆధునిక ఆటలు ఆడుకునే విధంగా సౌకర్యాలు కల్పించారు.