టెక్నాలజీతో నేరస్తుల ఆటకట్టిస్తూ.. శాంతి భద్రతల పరిరక్షణలో భేష్ అనిపించుకుంటున్న నగర పోలీసులు మరింత పారదర్శకమైన సేవలందించనున్నారు. ఇందులోభాగంగా ఠాణాలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సిటీలోని 64 పోలీస్స్టేషన్లలో ఇప్పటికే 35 వాటిల్లో కెమెరాల బిగింపు పూర్తయింది.
సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): సుప్రీం కోర్టు ఆదేశాలతో ఠాణాల లోపలి భాగం పూర్తిగా కెమెరాల కవరేజీలోకి వస్తున్నాయి. ఇందులో స్టేషన్ ఎస్హెచ్వో, డీఐ, ఏఐ, సబ్ ఇన్స్పెక్టర్లు, లాకప్లు, రికార్డు రూంలు అన్నింటిలోనూ నిఘా నేత్రాలు ఉండనున్నాయి. ఒక్కో పోలీస్స్టేషన్లో 19 చొప్పున కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పదిహేను కెమెరాలు లోపలి భాగం, మిగతా బయటి పరిసరాలు కనిపించేలా బిగిస్తున్నారు.
వివాదాలకు తావులేకుండా…
పోలీస్స్టేషన్లలో ప్రజలకు మరింత పారదర్శక సేవలందించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. పారదర్శకంగా సేవలందిస్తూ.. బాధితులకు భరోసా ఇస్తూ, నేరగాళ్లకు శిక్షలు పడేవిధంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా..ఒక్కోసారి ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి సమయాల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా..పోలీసులు పారదర్శకంగా ఉన్నారనే విషయాన్ని చెప్పేందుకు ఠాణాల్లోని సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయి.