సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): కరోనా కల్లోలంతో తొలిసారి లాక్డౌన్ విధించి మంగళవారానికి రెండేండ్లు పూర్తయ్యాయి. 2020 మార్చి 2న రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదయింది. మార్చి 22న మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. అదే రోజు తొలిసారి జనతా కర్ఫ్యూ విధించారు. ఆ తరువాత దాన్ని లాక్‌డౌన్‌గా ప్రకటించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. ఇతర ప్రాంతాల్లోని కార్మికులు, ఉద్యోగులు, ఉపాధి కోసం నగరానికి వచ్చిన వారితో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు సొంత ఊర్లకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో కాలిబాట పట్టారు.
పరిస్థితులను గమనించిన తెలంగాణ సర్కార్ వెంటనే రంగంలోకి దిగి ఆహార పదార్ధాలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి లక్షలాది మంది నిరుపేదలను ఆదుకున్నది. స్వచ్ఛంద సంస్థలు, దయా హృదయులు వ్యక్తిగతంగాను, సామూహికంగాను ముందుకు వచ్చి అన్నార్తుల ఆకలి తీర్చిన ఘటనలు మరువలేనివి. ఇతర రాష్ట్ర ప్రజలను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ తదితర శాఖలకు చెందిన సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిర్విరామంగా సేవలు అందించారు. కరోనా తొలి, రెండో దశలో గ్రేటర్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో విధులు నిర్వర్తించిన సిబందిలో 60శాతం మంది వైరస్‌కు గురవగా, కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
కరోనాలో పురుడుపోసుకున్న టిమ్స్
రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ముందుజాగ్రత చర్యగా తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో కొన్ని రోజుల వ్యవధిలోనే ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ను ఏర్పాటు చేసింది. 1500 పడకల సామర్థ్యంతో టిమ్స్‌లో తొలి దశ నుంచి నేటి వరకు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో వైరస్ తీవ్రత అధికంగా ఉండి ఆక్సిజన్ అవసరం పెరగడంతో రాష్ట్రంలో 27000 ఆక్సిజన్ పడకలను అందుబాటులోకి తీసుకువచ్చారు. థర్డ్‌వేవ్ వ్యాప్తి అధికంగా ఉంటుందనే వార్తలు రావడంతో ప్రతి దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 5వేల ఆక్సిజన్ పడకలను సిద్ధం చేశారు.
లక్షల మందికి ఊపిరి..
లక్షలాది మంది కొవిడ్ రోగులకు ఊపిరి పోసింది తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ. సొంత రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశంలోని పలు రాష్ర్టాల ప్రజలను కూడా ఆదుకున్నది. కరోనా లక్షణాలతో బాధపడిన 1,19,600 మంది రోగులకు తెలంగాణ ప్రభుత్వ వైద్యులు చికిత్స అందించారు. ఒక్క గాంధీ దవాఖానలోనే 86,500మందికి మెరుగైన చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు.
నోడల్ కేంద్రంగా గాంధీ సేవలు
రాష్ట్రంలో తొలి కేసు నమోదవడంతో గాంధీ దవాఖానను కరోనా నోడల్ కేంద్రంగా ప్రకటించారు. అక్కడ 2000 పడకలను కరోనా రోగులకు కేటాయించి, 500 ఐసీయూ పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో వెంటిలేటర్లను సమకూర్చారు. అంతటి క్లిష్ట సమయంలో తెలంగాణ సర్కార్ గాంధీతో పాటు ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, కింగ్ కోఠి జిల్లా దవాఖానలో కూడా కరోనా చికిత్సను ప్రారంభించింది. కరోనా రోగులకు సేవలందిస్తున్నందుకుగానూ గాంధీ వైద్యులపై 2020 ఏప్రిల్ మాసంలో భద్రతా దళాలు హెలిక్యాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించాయి.
కొవిడ్ నియంత్రణలో.. ఐఐటీ హైదరాబాద్ స్టార్టప్
సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో ఐఐటీ హైదరాబాద్ లాంగ్-లాస్టింగ్ శానిటైజర్, యాంటి వైరల్ కోటింగ్ విధానాన్ని అభివృద్ధి చేసింది. వాటిని స్టార్టప్‌ల ద్వారా మార్కెట్ చేసే విధంగా చేశారు. అలాగే ప్రతి రోజూ 200 లీటర్ల శానిటైజర్ తయారు చేసి కలెక్టర్లకు, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ ఉపయోగానికి ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేశారు. 5,500 మాస్కులకు సంబంధించి 3-ప్లే మాస్కులను స్థానికులకు పంపిణీ చేశారు. సంగారెడ్డికి చెందిన పోలీసులు, అడ్మినిస్ట్రేషన్, హెల్త్‌కేర్, దవాఖానల కోసం 10 వేల ఫేస్ షీల్డ్ రూపొందించారు. మూడు లక్షల వలస కార్మికులకు బియ్యం, డబ్బుల పంపిణీకి ప్రత్యేకమైనా ట్రాకింగ్ యాప్‌లను తయారు చేశారు. నామోకేర్, హిమాక్ రెండు స్టార్టప్‌లు కేంద్రాలు కలిసి ఐసీయూ పేషంట్ల కోసం ‘వైర్లెస్ నియోకేర్ రక్ష’ను తయారు చేశారు. సీఎఫ్హెచ్ఈ స్టార్టప్ ద్వారా జీవన్ లైట్ ద్వారా ఎన్95 ఈక్వెలెంట్ మాస్కులు డెవలప్ చేశారు. స్వచ్ఛ ఎయిర్ పేరుతో యూవీ స్టెరిలైజర్ కూడా అభివృద్ధి చేశారు.
2021 చూస్తా అనుకోలేదు
కరోనా తొలి, రెండో దశలను జీవితంలో మర్చిపోలేం. ఆ సమయంలో నోట్లోకి ముద్దపోయేది కాదు. ఫస్ట్‌వేవ్ సమయంలోనైతే 2021ని చూస్తా అనుకోలేదు. వైరస్ కొత్త. చికిత్సపై అవగాహన లేదు. అయితే స్వైన్‌ఫ్లూ సమయంలో పనిచేసిన అనుభవంతో మా టీమ్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యసిబ్బంది కష్టపడ్డారు. ప్రాణాలకు తెగించి రోగులను రక్షించడం గొప్ప విషయం. తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా స్పందిస్తూ చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టింది. దీంతో పొరుగు రాష్ర్టాల ప్రజలు కూడా గాంధీ క్యూ కట్టారు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గిపోయింది. అయితే ప్రజలు ఒక్కమాట గుర్తుపెట్టుకోవాలి. వైరస్‌ను లైట్ తీసుకోవద్దు. కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందే.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన