సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ)/మాదాపూర్: ప్రాచీన నాగరికతకు అద్దం పట్టే సంస్కృతి, సంప్రదాయాలు నేటి సమాజంలో కనుమరుగవుతున్నాయని, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, డాక్టర్ కేవీ రమణాచారి పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ తోలు బొమ్మలాట దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని (సాంస్కృతిక వనరులు, శిక్షణ కేంద్రం (సీసీఆర్టీ)లో కేంద్ర సంగీత నాటక అకాడమి, సాంస్కృతిక వనరులు శిక్షణ కేంద్రం, తెలంగాణ సంగీత నాటక అకాడమి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘పుటుల్ ఉత్సవ్’ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీసీఆర్టీ ప్రతినిధి చంద్రశేఖర్, సంగీత, నాటక అకాడమి కార్యదర్శి వసుంధర, తోలు బొమ్మలాట కళాకారిణి రత్నమాల నోరితో కలిసి కేవీ రమణాచారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం, పలు రకాల తోలుబొమ్మలతో వర్క్‌షాపును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ, దాదాపు 160 ఏండ్ల కిత్రం సమాజానికి సినిమాలు, మొబైల్ ఫోన్స్ అంటే తెలిసేవి కావని, అప్పట్లో తోలుబొమ్మల ప్రదర్శన మాత్రమే ఉండేదని అన్నారు. ‘ఆజాదికే రంగ్ ఫుతుల్ కే సంగ్’ అనే శీర్షికతో నగరంలో 23వ తేదీ వరకు ‘తోలు బొమ్మల ప్రదర్శన’ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఎంతో కాలంగా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ కళను అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో పలువురు విద్యార్థులతో పాటు పలు ప్రాంతాలు చెందిన ప్రదర్శనకారులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణకు చెందిన తోలుబొమ్మల ప్రదర్శనకారులు పాల్గొన్నారు.