సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో దళిత బంధు పథకం అమలుకు సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయి. జిల్లా పరిధిలో ఉన్న దాదాపు 15 నియోజక వర్గాలలో 1500 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే, వారిలో 14 మంది మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వెళ్లినట్లు జిల్లా సంక్షేమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. దళిత బంధు పథకానికి ఎంపికైన వారికి అందజేసే రూ.10 లక్షల నగదును ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలి? అధిక లాభం వచ్చే వ్యాపారాలు ఏమి ఉన్నాయి? దేనిపై పెట్టుబడులు పెట్టుకోవాలి? అన్న అంశాలపై ఎంపికైన వారికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్, అంబర్పేట్, ఖైరతాబాద్ వంటి మూడు నియోజక వర్గాలలో అవగాహన తరగతులు నిర్వహించామన్నారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే అవగాహన కార్యక్రమాల వల్ల దళిత బంధు పథకం అమలు ప్రక్రియ ఆలస్యమవుతున్న నేపథ్యంలో మిగిలిన 12 నియోజక వర్గాలకు చెందిన వారికి హరహర కళాభవన్లో ఒకేసారి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.
కారు లేదా ట్రాక్టర్కే.. ఎక్కువ మంది మొగ్గు
ఇప్పటి వరకు జిల్లాలో దళితబంధు పథకానికి ఎంపికైన వారు ఎక్కువగా కారు, లేదా ట్రాక్టర్ లేదా ట్రాలీ వంటి వాహనాలు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. మరికొంత మంది మాత్రం వినూత్నంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగంపై మొగ్గు చూపుతున్నారు. రూ.10 లక్షల పెట్టుబడి పెట్టి భవన నిర్మాణానికి కావాల్సిన సెంట్రింగ్ సామగ్రి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు ఐరన్ షాపు, ఇంటికి మెయిన్ గేట్, కిటీకీలకు కావాల్సిన ఐరెన్/హార్డ్వేర్ షాపులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. మరి కొందరు సూపర్ మార్కెట్లు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు జిల్లా అధికారులు గుర్తించారు. ఈ మేరకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నారు.