ఘట్కేసర్ రూరల్, మార్చి 12: మత్తుకు బానిసలు కావడంతో పాటు గంజాయిని అమ్మేందుకు యత్నించిన ఐదుగురు విద్యార్థులను ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గడ్డం సూర్యప్రకాశ్(23), గొడుగు సాయివంశీ(24), బానోతు చంద్రబాబు(21), సూర్యాపేట పట్టణానికి చెందిన అనంతుల మనోజ్(28), మంచిర్యాల జిల్లాకు చెందిన యశ్వంత్ పాటిల్(23) నగరంలోని వివిధ కళాశాలల్లో ఉన్నత విద్య చదువుతున్నారు. వీరంతా గంజాయికి అలవాటు పడ్డారు.
అంతేకాకుండా గంజాయిని తక్కువ ధరకు తీసుకొచ్చి ఎక్కువ రేటుకు అమ్మాలని ప్లాన్ వేశారు. 8న ఘట్కేసర్ బస్టాండ్ వద్ద సరుకు అమ్మేందుకు యత్నిస్తుండగా, సమాచారం అందుకున్న ఎస్సై విజయ కృష్ణమూర్తి సిబ్బందితో కలిసి నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకొని..రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.