
మేడ్చల్, నవంబర్18 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ఘట్కేసర్ మండలం కొండాపూర్‌లో బాలికల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ఏర్పాటుకు అనుమతి లభించింది. బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థ ఏర్పాటుకు హిందుస్తాన్, ఏరోనాటిక్స్ లిమిటెడ్ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 7 కోట్ల నిధులు మంజూరు చేయనున్నారు. మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు కానున్న ఐటీఐలో ప్రతి ఏడాది 232 మంది బాలికలకు ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్, మెకానిజం, ఫ్యాషన్ డిజైన్, కంప్యూటర్ టెక్నాలజీ, ఎంబ్రాయిడరీ డిజైన్లపై శిక్షణ ఇచ్చేందుకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. ఐటీఐ ఏర్పాటుకు సంబంధించి మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో హెచ్ఏఎల్ సంస్థ తరఫున జనరల్ మేనేజర్ అరుణ్ జనార్దన్ సరకటే, రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ శాఖ సంచాలకులు వై. నాయక్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు నాగేశ్, మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి, అనిల్‌కుమార్, కె.కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రి చామకూర మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.