మేడ్చల్, మార్చి 10(నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలకు 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించి నిధుల కేటాయింపు పూర్తయింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు బడ్జెట్లో రూ. 659.53 కోట్ల నిధులను సభ్యుల ఆమోదంతో కేటాయించారు. నగర శివారుల్లోని మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించారు. జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు బడ్జెట్ కేటాయింపులు పూర్తయ్యాయని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమయ్యే నిధులను బడ్జెట్ సమావేశాల్లో సభ్యుల ఆమోదం మేరకు కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు.