సిటీబ్యూరో, మార్చి 10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. నిరుద్యోగులను మోసం చేసేందుకు దళారులు తిరుగుతుంటారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయని స్పష్టం చేశారు. దళారుల సమాచారం ఉంటే డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నంబర్-9490617111కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. 2016, 2018లో సుమారు 18 వేల పోలీసు ఉద్యోగాలకు సంబంధించి..
నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇచ్చామన్నారు. ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, బీబీనగర్, అంబర్పేట్ కార్ హెడ్ క్వార్టర్స్లలో ప్రీ రిక్రూట్మెంట్ క్యాంపులను నిర్వహించామని, పేదరికంలో ఉన్న సుమారు 3వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసి.. శిక్షణ అందించామని వివరించారు. అందులో 700 మంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై..పోలీసు ఉద్యోగాలను పొందినట్లు వెల్లడించారు. ఈసారి సైతం ప్రీ-రిక్రూట్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగ యువత విజయం సాధించేలా తీర్చిదిద్దుతామని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు.