సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : నగర శివారులో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న కొత్త లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వరకు గడువు విధించింది. రంగారెడ్డి జిల్లా పరిధి హయత్‌నగర్ సమీపంలోని తొర్రూరులో 110ఎకరాలు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్‌పల్లిలోని 40ఎకరాల్లో హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లను అభివృద్ధి చేసి విక్రయిస్తున్నారు. ఇందులో మొదటి విడతగా ప్లాట్లను ఆన్లైన్లో మార్చి 14 నుంచి 17వ తేదీ వరకు విక్రయించనున్నారు.
లే అవుట్లో సకల వసతులు
ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ నేపథ్యంలో ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసి విక్రయిస్తున్నది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో కూడిన లేఅవుట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ఉప్పల్ భగాయత్‌లో సుమారు 400ఎకరాల్లో చేపట్టిన లేఅవుట్ తరహాలోనే ఈ లే అవుట్లలో సైతం విశాలమైన రోడ్లు, మంచినీరు, సీవరేజీ లైన్లు, విద్యుత్, పార్కులు వంటి మౌలిక వసతులను కల్పించనున్నారు. లేఅవుట్ నిబంధనల ప్రకారం 10శాతం భూమిని కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయిస్తున్నారు.
పారదర్శకంగా హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం
దేశంలోని మెట్రో నగరాల్లో అత్యంత నివాస యోగ్యంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం జోరుగా సాగుతున్నది. ఈనేపథ్యంలో నగర వాసులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి వివాదాలు లేని క్లియర్ టైటిల్ కలిగిన భూముల్లో నివాసానికి ఎంతో అనుకూలంగా ఉండేలా హెచ్ఎండీఏ లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీని ద్వారా ప్లాట్ల విక్రయాన్ని ఆన్లైన్ వేలం ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.