మెహిదీపట్నం, మార్చి 6 : కంటి చూపును నిశ్శబ్దంగా హరించే నల్లకాసుల(గ్లకోమా) వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఆదివారం మెహిదీపట్నం సరోజినిదేవి కంటి దవాఖానలో గ్లకోమా వారోత్సవాలను మంత్రి టి.హరీశ్ రావు, నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ 40 సంవత్సరాలు పైబడిన వారు ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ ఉన్న వారిలో 3శాతం మంది గ్లకోమా బారిన పడుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలు, యూపీహెచ్‌సీల్లో ప్రతి ఆరోగ్య కార్యకర్తకు గ్లకోమా వ్యాధిపై అవగాహన కల్పిస్తామన్నారు.
దేశానికే ఆదర్శం ‘కంటి వెలుగు’
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కంటివెలుగు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కోటియాభై లక్షల మందికి కంటి పరీక్షలు జరిపి అవసరమున్నవారికి చికిత్సలు అందజేశామని, 40 లక్షల మందికి అద్దాలను ఉచితంగా ఇచ్చామని తెలిపారు. సరోజిని దేవి కంటి దవాఖానను మరింత అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ఆస్పత్రిలో పర్యటించి ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఎమ్మెల్యే జాఫర్ మెరాజ్ హుస్సేన్ మాట్లాడుతూ ఆస్పత్రి బయట ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీఎంఈ వెంకటి, ఎన్సీబీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కళావతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, ఆర్ఎంఓ నజాఫీ బేగం, డాక్టర్లు రవీందర్ గౌడ్, వెంకటరత్నం, సుపర్ణ, ప్రతిమ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన గ్లకోమాపై అవగాహన ర్యాలీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.