సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీద్రభారతిలో ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, టీఎస్‌డబ్ల్యూసీ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి హాజరయ్యారు. మహిళలు సాధించాల్సిన విజయాలను కొనియాడారు. పలు అంశాలపై నిపుణులతో అవగాహన కల్పించారు. ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు.. వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పారు. విభిన్న రంగాల్లో రాణించిన 8 మంది మహిళలను మంత్రులు సత్కరించారు. ఈ వేడుకలకు నగరంలోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థినులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
మహిళామణులకు సత్కారం..
విభిన్న రంగాల్లో రాణించిన 8 మంది మహిళలను మంత్రులు సత్కరించారు. వీ హబ్ సీఈఓ దీప్తి, సినీ గేయ రచయిత్రి, కవి విశ్వైక, చిత్ర కళాకారిణి నిర్మలా తేజస్వి, తెలుగు పండిట్ డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ, సామాజిక కార్యకర్త, స్త్రీ శక్తి పురస్కార గ్రహీత డాక్టర్ పద్మావతి, మిస్ యూనివర్స్ ఇంటిగ్రిటీ గ్రహీత రోహిణి నాయుడు, సామాజిక కార్యకర్త దీప, బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్న ఏఆర్ఈఎస్ సంస్థ ఫౌండర్ సుకన్య సన్మానం అందుకున్న వారిలో ఉన్నారు.
వేధిస్తే.. శిక్షే
తమపై జరుగుతున్న హింసను చెప్పుకునేందుకు మహిళలు ఇబ్బంది పడుతుంటారు. ఎవరికి చెబితే ఏమనుకుంటారోనని కుమిలిపోతుంటారు. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వాట్సాప్ నంబర్‌ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ప్రతి కాలేజీ, స్కూల్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 9490555533 నంబర్‌ను అందుబాటులో ఉండేలా చూస్తామని వారు పేర్కొన్నారు.
ఆడపిల్లలను గౌరవించుకునే సంస్కృతి పెరుగుతున్నది
ఓ గర్భిణి తన భర్తను.. కొడుకు పుడితే ఏం చేస్తావని అడిగితే “అన్ని విషయాలు నేర్పి వాడికి నచ్చిన రంగంలో ఎదిగేలా కృషి చేస్తా. అదే ఆడపిల్ల పుడితే నా తల్లి పుట్టిందని అనుకుంటా. నేను నేర్పాల్సిందేమీ లేదు. తను పుట్టుకతోనే అన్ని నేర్చుకునే వస్తుంది. నన్ను తల్లిలా లాలిస్తుంది” అని చెప్పాడు. ఇలా సమాజంలో ఆడపిల్లలను గౌరవించుకునే సంస్కృతి రోజురోజుకూ పెరుగుతుంది.
– సునీతా లక్ష్మారెడ్డి, టీఎస్సీడబ్ల్యూ చైర్పర్సన్
విద్యతోనే విజయం
ప్రతి ఆడబిడ్డ విద్యావంతురాలు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఈ దిశగానే ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపడుతున్నది. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నది. ప్రతీ మహిళ లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా అధైర్యపడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయవద్దు. విస్తృతంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలి. మీకు ఎలాంటి కష్టం వచ్చినా మమ్మల్ని సంప్రదించొచ్చు.
-సత్యవతి రాథోడ్, మహిళాశిశు, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి
స్త్రీ లేని సమాజం లేదు..
నేల నుంచి అంతరిక్షం వరకు.. సర్పంచి నుంచి రాష్ట్రపతి వరకు ప్రతీ ప్రస్థానంలో మహిళలది కీలక రోల్. వారి లేనిది అభివృద్ధి లేదు. అవరోధాలు అందరికీ ఎదురవుతాయి. వాటిని తట్టుకొని నిలబడితే విజయం తథ్యం. మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నది. మహిళలందరికీ సీఎం కేసీఆర్ అండగా నిలబడుతున్నారు. ఇలాంటి సీఎం ఉండటం మనందరి అదృష్టం.
– సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ఆత్మవిశ్వాసమే కొండంత బలం
ప్రతి ఒక్కరి విజయం వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆడవారిపై ఉన్న నిషిద్ధాలను బ్రేక్ చేయాలి. ఒకప్పుడు ఇంజినీర్, మ్యాథ్స్ సబ్జెక్టులను అబ్బాయిలే చదవాలని అనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నోబెల్ బహుమతికి సమానమైన ఫీల్డ్స్ మెడల్ సాధించిన మిర్జాఖాని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ప్రతి మహిళ అవకాశాలు గుర్తించి ఉన్నతంగా ఎదుగాలి.
-దివ్య దేవరాజన్, డబ్ల్యూడీసీడబ్ల్యూ స్పెషల్ సెక్రటరీ
లక్ష్యంపై గురిపెట్టాలి
తెలంగాణలో ఉన్న అవకాశాలు మరెక్కడా లేవు. మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రభుత్వం సహకారం అందిస్తున్నది. అవకాశాలను గుర్తించి అందుకు తగ్గట్టు కష్టపడితే సరిపోతుంది. ఇంకా మనం వెనకబడిపోతున్నామనే ఆలోచన మానేయాలి. వీ హబ్‌తో చాలా మంది సామాన్య మహిళలు వేలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మన ఆలోచనలకు పదునుపెడితే విజయం ఖాయం.
– దీప్తి రావుల, వీ హబ్ సీఈఓ
హార్డ్వర్క్తోనే గెలుపు సాధ్యం
మనం ఏ రంగంలో ఉన్నా అందుకు తగ్గ జ్ఞానాన్ని పెంచుకోవాలి. కష్టాన్ని నమ్ముకుంటే విజయానికి దగ్గరవుతాం. మహిళల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్, నిర్భయ, మహిళా కమిషన్, స్త్రీ నిధి రుణాలు ఇలా అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఆసరా చేసుకుంటూ ఎదగాలి.
-విశ్వైక, సినీ గేయ రచయిత్రి