శేరిలింగంపల్లి, మార్చి 3: గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన కమ్యూనిటీ ప్రాజెక్టు-2022 ప్రదర్శన ఆకట్టుకున్నది. పాఠశాల ఆడిటోరియంలో గురువారం ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనను ప్రిన్సిపాల్ హేమా చెన్నుపాటి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 8వ తరగతికి చెందిన దాదాపు 120మంది విద్యార్థులు ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ అనుభవాలను ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శించి అబ్బురపరిచారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. బాధ్యతాయుతమైన సామాజిక పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రదర్శనలు ఎంతగానో దోహదపడుతాయని ప్రిన్సిపాల్ హేమా చెన్నుపాటి అన్నారు. తమ దృష్టికి వచ్చిన సామాజిక అంశాలను ఎంచుకొని వాటిని తమదైన శైలిలో నమూనాల రూపంలో విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారని చెప్పారు.
ఎన్నో ఏండ్లనాటి సమస్యకు పరిష్కారం
ఎన్నో ఏండ్లుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న బేగంపేటలోని దేవనార్ అంధ విద్యార్థుల పాఠశాలకు ఓక్రిడ్జ్జ్ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు రుత్విక, అలేఖ్య (మంత్రి కేటీఆర్ కూతురు) ఈ ప్రాజెక్టులో చక్కటి పరిష్కారం కనుగోన్నారు. ఫీల్డ్ విజిట్లో భాగంగా బేగంపేటలోని అంధ విద్యార్థుల పాఠశాలకు వెళ్లిన రుత్విక, అలేఖ్య వారితో పలు సామాజిక పరమైన విషయాలపై చర్చించారు. దీంతోపాటు అక్కడ విద్యార్థులు సరైన తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించి తాగునీటి సమస్యపై దృష్టిసారించారు.
తమకు అందుబాటులో ఉన్న దాతల సహకారంతో రూ.2లక్షలు సేకరించి దాంట్లో రూ.లక్షా 50వేలతో వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ను ఏర్పాటుచేయగా.., మిగతా 50 వేలతో విద్యార్థులకు భోజన వసతులు కల్పించారు. దాదాపు 480మంది అంద విద్యార్థులు ఉన్న ఆ పాఠశాలలో నీటి శుద్ధి యంత్రం ఏర్పాటు చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సేవాభావాన్ని చాటుకోవడంతో పాటు కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రదర్శనలో తమ నమూనాగా ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.