తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కొందరు కుట్ర పన్నడాన్ని వివిధ సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఇది దుర్మార్గమైన చర్య అంటూ.. మండిపడ్దాయి. మంత్రి జోలికి వస్తే.. ఊరుకునేది లేదని హెచ్చరించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరాయి.
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 3: తెలంగాణ ఉద్యమకారుడు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కుట్రను భగ్నం చేసిన పోలీసు శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కుట్రకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం కుట్ర చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైగౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో మంత్రి అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక హత్యకు కుట్ర చేశారని ఆరోపించారు.
కేసు తేలే వరకు జితేందర్‌రెడ్డి, డీకే అరుణను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ కుట్రకు బీజేపీ పరోక్ష మద్దతు ఉందని భావించాల్సి వస్తుందన్నారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుదగాని ఫౌండేషన్ చైర్మన్ హరిశంకర్‌గౌడ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్‌గౌడ్, జై గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు శేషగాని నరేశ్‌గౌడ్, వివిధ సంఘాల నాయకులు తాళ్ల శ్రీనివాస్‌గౌడ్, మునికుంట్ల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.