సిటీబ్యూరో, మార్చి 3(నమస్తే తెలంగాణ): మారు వేషంలో నేరస్తుల డెన్‌కు వెళ్లి.. వారిని పట్టుకోవడం సినిమాల్లో చూస్తుంటాం.. అచ్చం అలానే సిటీకి చెందిన ఓ మహిళా పోలీస్ ఆఫీసర్.. అలాంటి చాతుర్యాన్నే ప్రదర్శించి.. హుక్కా సెంటర్‌కు మఫ్టీలో వెళ్లి.. సిబ్బందికి లైవ్ లొకేషన్ పెట్టి.. నిర్వాహకులకు మైండ్ బ్లాక్ చేశారు. మత్తు దందాను తనదైన శైలిలో చిత్తు చేశారు. ఇలా సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో జరుగుతున్న అక్రమ దందాలు, అసాంఘిక శక్తుల అడ్డాలపై డైరెక్ట్‌గా అటాక్ చేస్తూ.. ఆ మహిళా అధికారి.. నేరస్తులకు వణుకు పుట్టిస్తున్నారు. ఆమె స్వయంగా చేస్తున్న ప్రత్యేక ఆపరేషన్లు ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే సంచలనం సృష్టిస్తున్నాయి.
అలా వెళ్లి..
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డీసీపీ హోదాలో ఉన్న అధికారి ఇటీవల మాదాపూర్‌లోని ఓ హుక్కా కేంద్రం గురించి తెలుసుకున్నారు. అక్కడ మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారని పక్కా సమాచారాన్ని సేకరించారు. స్వయంగా పరిశీలించేందుకు ఎవరికీ తెలియకుండా సివిల్ దుస్తుల్లో అక్కడికి వెళ్లారు. కొన్ని నిమిషాల పాటు అక్కడ జరుగుతున్న వ్యవహరాలను నిశితంగా గమనించారు. ఆ తర్వాత తన సిబ్బందికి వెంటనే స్పాట్‌కు రావాలంటూ.. వాట్సాప్ మెసేజ్ పెట్టి.. లైవ్ లొకేషన్ షేర్ చేశారు. ఆ సందేశంలో ఎక్కడ కూడా హుక్కా కేంద్రం పేరు పెట్టలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన బయలుదేరారు. తన సిబ్బందికి ఎప్పటికప్పుడు లొకేషన్‌ను షేర్ చేసుకుంటూ.. హుక్కా సెంటర్లో నడుస్తున్న తతంగాన్ని గమించిన డీసీపీ.. సిబ్బంది చేరుకుగానే.. లేచి నిలబడిన చప్పట్లు కొట్టారు. ఏ ఒక్కరూ ఇక్కడి నుంచి కదలవద్దని హెచ్చరించారు. ఈ హఠాత్ పరిణామానికి హుక్కా నిర్వాహకులు, అక్కడ ఉన్న వారంతా కంగుతున్నారు. హుక్కా సేవిస్తున్న వారు, నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దందాను ఆపివేయించారు. డీసీపీ స్థాయి అధికారి స్వయంగా రంగంలోకి దిగడంతో ఇప్పుడు ఈ అంశం పోలీసు వర్గాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది.