సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఉబకాయం.. శరీరానికి రోగాలను ఆహ్వానించే అవస్థ. ఇది మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఒక్కటి కాదు రెండు కాదు పలు రకాల అనారోగ్య సమస్యలకు ఉబకాయం కారణమవుతున్నదని యశోద దవాఖాన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజి వైద్యనిపుణురాలు డాక్టర్ కోన లక్ష్మీకుమారి తెలిపారు. ఉబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సంవత్సరం మార్చి 4ను ‘వరల్డ్ ఒబేసిటీ డే’గా పరిగణిస్తున్నట్లు తెలిపారు.
నగరంలోనూ అధికమే..!
ప్రపంచ వ్యాప్తంగా 80కోట్ల మంది ఉబకాయ సమస్యతో బాధపడుతుండగా.. మన దేశంలో 18.5 కోట్ల మంది ఉన్నట్లు వైద్యనివేదికల ద్వారా తెలుస్తున్నది. ఇక హైదరాబాద్లోని నగర జనాభాలో 18నుంచి 20శాతం మంది ఉబకాయ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గడిచిన రెండేండ్లలో వీరిసంఖ్య మరింత పెరిగినట్లు వెల్లడించారు.
నడక తగ్గింది
ఉబకాయ సమస్యకు మారుతున్న జీవన విధానమే ప్రధాన కారణమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యాంత్రిక జీవనానికి అలవాటు పడిన ప్రజల్లో శారీరక శ్రమ తగ్గింది. గంటల తరబడి ఒకే చోటు కూర్చోవడం, బటన్లు నొక్కుతూ, స్క్రీన్లను టచ్ చేస్తూ పనులు చేయడం సులువుగా అలవాటైంది. ఇంటి వద్ద కూర్చుంటే ఆఫీసులో దిగుతున్నారు. ఇలా దినచర్యలతో నడక పూర్తిగా తగ్గిపోయింది. దీనికి ఆహారపు అలవాట్లు (ఫాస్ట్ఫుడ్, బర్గర్లు, వేంపుడు, బేకరీ ఫుడ్స్, మాంసాహారం) సైతం తోడయ్యాయి. అంతే కాకుండా సమయానికి ఆహారం తీసుకోకపోవడం కూడా ఉబకాయానికి ఒక కారణంగా వైద్యులు చెబుతున్నారు.
నడక, వ్యాయామం తప్పనిసరి
ప్రతి రోజు తప్పనిసరిగా కనీసం అరగంట పాటు వ్యాయామం, వీలైనంతగా నడవడం, యోగాసనాలు, మాంసాహారం తగ్గించడం, కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలకు దూరంగా ఉండటం వంటి నియమాలు పాటించాలి. ఎక్కువగా పండ్లు, పండ్ల రసాలు, ఆకు కూరలు, శాఖాహారం తీసుకోవాలి. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర కార్యాలయాల్లో కంప్యూటర్లపై పనిచేసే ఉద్యోగులు గంటలో కనీసం ఒక్కసారైన లేచి ఐదు అడుగులు నడిచి తిరిగి వచ్చి పనిచేసుకోవాలి.
ముంచుకొచ్చే సమస్యలు
గుండెపోటు
అధిక రక్తపోటు
మధుమేహం
మోకాళ్ల నొప్పులు
ఊపిరితిత్తులు దెబ్బతినడం
క్యాన్సర్
బేరియాట్రిక్ సర్జరీతో ఉపశమనం
ఊబకాయం సమస్య పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నది. ఇది వివిధ అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నది. భరించలేని విధంగా ఊబకాయం బారిన పడితే దాని నుంచి విముక్తి పొందడానికి బేరియాట్రిక్ సర్జరీయే ఉత్తమ పరిష్కారం. బేరియాట్రిక్ సర్జరీ వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని మెటాబాలిక్ సిండ్రోమ్ మెరుగుపడుతుంది. టైప్-2 డయాబెటిక్ 80శాతం, హైపర్ టెన్షన్ 70శాతం తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ముఖ్యంగా మహిళల్లో బరువు తగ్గడం వల్ల దెబ్బతిన్న సంతానోత్పత్తి మెరుగుపడుతుంది. బేరియాట్రిక్ సర్జరీ ప్రస్తుతం ఉన్న చికిత్సల్లో ఉత్తమమైనదిగా చెప్పవచ్చు.
– డాక్టర్ కోన లక్ష్మీకుమారి,సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజి,బేరియాట్రిక్ సర్జన్, యశోద హాస్పిటల్