సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : ఆయుధాల కేసులో సోదరులను ఇరికించి వివాదంలో ఉన్న ఆస్తిని కాజేందుకు ప్రయత్నించిన మరో సోదరుడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నగర అదనపు సీపీ(క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్, సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధకిషన్రావులతో కలిసి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. రసూల్‌పురాలో నివాసముండే షేక్ మహ్మద్ అమ్జతుల్హా(54)కు అన్న షేక్ మహ్మద్ అహ్మద్ అబదుల్హా(56), తమ్ముడు షేక్ మహ్మద్ అహ్మదుల్హా అలియాస్ సోయల్(44) సోదరులు.
బేగంపేట్‌లోని రసూల్‌పురాలో నివాసముంటూ గతంలో ఉమ్మడిగా ముషీరాబాద్‌లో హార్డ్‌వేర్ వ్యాపారం నిర్వహించారు. వీరికి బేగంపేట్ నవాబ్కాలనీ, టోలిచౌకి, కింగ్‌కోఠి, నాచారం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. 2005లో తండ్రి చనిపోవడంతో ఆస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ తగాదాలను పరిష్కరించేందుకు ఎంతో మంది పెద్దలు ప్రయత్నించినా 15ఏండ్లుగా కొలిక్కి రాలేదు. దీంతో తన అన్న, తమ్ముడు ఇద్దరు కలిసి ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉండేందుకు కుట్ర చేస్తున్నారని మహ్మద్ అమ్జతుల్హా అనుమానం వ్యక్తం చేశాడు. ఇందులో భాగంగా ఆ ఇద్దరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పథకం వేశాడు. కొన్నేండ్ల కిందట ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ సలీం(ప్రస్తుతం చనిపోయాడు) నుంచి మహరాష్ర్ట నాదేండ్లో ఓ దేశవాళీ పిస్తోల్, 10 లైవ్ రౌండ్స్‌ను రూ.5 వేలకు, అలాగే రెండు కత్తులను అమ్జతుల్హా కొనుగోలు చేశాడు. ముగ్గురి ఇండ్లు పక్క పక్కనే ఉండటంతో ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఇటీవల తన ఇద్దరు సోదరులు అయుధాలు కలిగి ఉన్నారనే అక్రమ కేసులలో ఇరికించాలని ఫ్లాన్ చేశాడు. వాళ్లు ఆయుధాల యాక్ట్ కింద అరెస్ట్ అయితే ఈజీగా వివాదంలో ఉన్న ఆస్తిని తన సొంతం చేసుకోవచ్చనుకున్నాడు. ఈ క్రమంలోనే తన తమ్ముడి ఇంటి వద్ద దేశవాళీ తుపాకీతో పాటు, లైవ్ రౌండ్లు పెట్టాడు. ఆ తరువాత గుర్తుతెలియని నంబర్ నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని తనిఖీలు చేయగా కంట్రీమేడ్ పిస్తోల్, లైవ్ రౌండ్లు బుల్లెట్లు, రెండు కత్తులు లభించాయి. దీంతో అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో షేక్ మహ్మద్ అమ్జతుల్హానే పక్కా ఫ్లాన్‌తో చేసినట్లు వెల్లడి కావడంతో అరెస్ట్ చేశారు.