సికింద్రాబాద్, మార్చి 2: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ప్రజలకు నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. వీటికి అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం జలమండలికి విడుదల చేసింది. ఈ నిర్ణయం 2022 ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే ఉచిత తాగునీటి పథకం అమలవుతున్నదని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఉన్న ఏకైక ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గమైన కంటోన్మెంట్లో కూడా ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే సాయన్న కోరినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం 70 శాతం కంటోన్మెంట్ ప్రాంతంలో ఉండగా, 30 శాతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉందనీ, ఈ నియోజకవర్గంలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే ఉంటున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ పరిధిలోని వారికి కూడా ఉచితంగా తాగునీటిని సరఫరా చేయాలని కోరారు. కంటోన్మెంట్ పరిధిలో 31,745 తాగునీటి కనెక్షన్లు ఉన్నాయని, వీటిలో 16,901 స్లమ్ ఏరియాలో ఉన్నాయని తెలిపారు.
నివాసాల్లో వ్యక్తిగత తాగునీటి కనెక్షన్లు 13,391 ఉన్నాయని , 453 అపార్ట్మెంట్లు ఉన్నాయని జలమండలి అధికారులు లెక్కలు వేశారు. వీరికి 5.9 ఎంజీడీ అవసరమని గుర్తించారు. ఉచితంగా నీరు పొందాలనుకునే వారు ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా జలమండలి ప్రతి నెలా రూ.1.40కోట్లు, సంవత్సరానికి రూ. 16.08 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని లెక్కలు వేశారు. ఇప్పటికే రూ. 34.17 కోట్ల బకాయిలు ఈ ప్రాంతం నుంచి రావాల్సి ఉందని జలమండలి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. బకాయిలను కంటోన్మెంట్ బోర్డు జలమండలికి చెల్లించాలని ఉత్తర్వులలో సూచించారు. రూ. 16.08 కోట్లను జలమండలికి విడుదలజేస్తూ ప్రభుత్వం మరో జీవోను బుధవారం విడుదల చేసింది.
జీవో జారీపై హర్షం ఎమ్మెల్యే సాయన్న
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉచిత మంచినీటి పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేయడంపై ఎమ్మెల్యే సాయన్న హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు బుధవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో దాదాపు 32 వేల మంచినీటి కనెక్షన్లు ఉన్నాయని, ఇకపై వినియోగదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే 20 వేల లీటర్ల తాగునీటిని వినియోగించుకోవచ్చని తెలిపారు. జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డుల పరిపాలనా విధానాలు భిన్నమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నల్లా మీటర్లను వినియోగదారులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే సాయన్న పార్టీ నేతలు, కార్యకర్తలకు మిఠాయిలు తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, నళినికిరణ్. ప్రభాకర్, లోకనాథంతో పాటు నాయకులు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, నాగేశ్, శ్రీహరి, భాస్కర్, శంకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.