బన్సీలాల్‌పేట్, మార్చి 2 : కరోనా రోగులకు వైద్య చికిత్సలు అందిస్తూ అదే వ్యాధికి గురై ప్రాణాలు కోల్పోయిన గాంధీ దవాఖాన వైద్యులు, సిబ్బంది సేవలు ఎన్నటికీ మరువలేనివని డీఎంఈ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 85 వేల మంది కొవిడ్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించి డిశ్చార్జి చేసిన దవాఖానగా గాంధీ దవాఖాన ఘనత వహించిందన్నారు.
650కి పైగా ఐసీయూ బెడ్లతో రోగులకు వైద్య సేవలందదించడం మామూలు విషయం కాదని చెప్పారు. కొవిడ్ వెలుగు చూసి బుధవారం నాటికి రెండేండ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని గాంధీ అలుమ్ని భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కొవిడ్ అమరులకు ఘనంగా నివాళులర్పిస్తూ, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నరసింహారావు, డాక్టర్ శోభన్‌బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మ, ఆర్ఎంవోలు డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ నరేంద్రకుమార్, వైద్యాధికారులు డాక్టర్ శ్రవణ్‌కుమార్, డాక్టర్ శేషాద్రి, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, అడ్మిన్ సూపరింటెండెంట్ విజయభాస్కర్, డాక్టర్ సంగీత, డాక్టర్ కృష్ణమూర్తి, యాదిలాల్ తదితరులు పాల్గొన్నారు.