సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో వందశాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా రూ. 3,800 కోట్లతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులపై బుధవారం ఖైరతాబాద్ సంస్థ కార్యాలయంలో అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎండీ దానకిశోర్ సమీక్ష నిర్వహించారు. అన్ని ఎస్టీపీల నిర్మాణ పురోగతిని విడివిడిగా సమీక్షించారు. అక్టోబర్ నాటికి ఎస్టీపీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఈ మేరకు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని ఎస్టీపీల వద్ద మూడు షిఫ్టుల్లో పనులు జరిగేలా చూడాలని, రాత్రి వేళల్లో పనులు జరుగుతున్నప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీల సీజీఎంలు, జీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.