తెలుగుయూనివర్సిటీ, మార్చి 2 : తెలంగాణ సంస్కృతి వెలుగులు న్యూయార్క్ నగరంలో వెల్లివిరిశాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మక్క సారక్క ఇతివృత్తంగా సాగిన సంబురాలు న్యూయార్క్ ప్రజలనే కాకుండా వర్చువల్‌గా వీక్షించిన తెలంగాణవాసులను అలరించాయి.
తెలంగాణ జానపద గాయకులు మానుకోట ప్రసాద్ ఆధ్వర్యంలో బంధం రాజు, శిరీష, లావణ్య జానపద గేయ విభావరి ఆద్యంతం ఉర్రూతలూగించింది. పేరిణి సందీప్ బృందం సమ్మక్క సారక్క ఇతివృత్తంతో సాగించిన సంబురాలు ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాయి. పాలమూరు రాజు ఆలపించిన భావగీతాలు ఆలోచింపజేశాయి. లోకల్ టాలెంట్ విభాగంలో న్యూయార్క్‌కు చెందిన బాలబాలికలు ప్రదర్శించిన జానపద, నృత్య ప్రదర్శనలు హైలెట్‌గా నిలిచాయి. అంతర్జాలం వేదికగా తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు మన వారతస్వ చరిత్రను విశ్వవ్యాప్తం చేసేందుకు పడుతున్న తపనను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. నైటా అధ్యక్షులు రవీందర్‌కుమార్ కంటం మాట్లాడుతూ అమెరికాలాంటి దేశంలో ఉన్నా తమ ఆత్మ అంతరాత్మ తెలంగాణేనన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ బోర్డు చైర్మన్ డాక్టర్ రాజేందర్‌రెడ్డి జిన్నా, కార్యదర్శి సతీశ్ కాలువ, ప్రధాన కార్యదర్శి సింగిరి కొండవాణి, కోశాధికారి కంకణాల గీత సునీల్, ప్రసన్న, హరిక, రవీందర్,కృష్ణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.