అదో పేదల బస్తీ.. కూలీనాలి చేసుకుని రెక్కల కష్టంతో బతుకులు వెళ్లదీసే శ్రమజీవులు వారంతా.. పగలంతా పనులు చేసి ఇంటికి చేరాక..మద్యం తీసుకోవటం వారి దినచర్యలో భాగం. అయితే మద్యం మత్తులో గొడవలు జరగడం కూడా ఇక్కడ పరిపాటి. ఇటీవల ఓ హత్య కూడా జరగడంతో ఆ బస్తీపై పోలీసులు దృష్టి సారించారు.సమస్య మూలాలను కాఠిన్యంతో కాకుండా కారుణ్య మనస్సుతో చూశారు. అక్కడ తాము చేయాల్సింది గస్తీ మాత్రమే కాదని గ్రహించి.. అక్షర జ్యోతులను వెలిగించి వారిలో మార్పుకు శ్రీకారం చుట్టారు.
ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దాసారం బస్తీ.. సుమారు 270 పూరి గుడిసెలు ఉంటాయి. చిత్తుకాగితాలు ఏరుకుని జీవనం సాగించే నిరుపేదలు ఎంతో మంది. బల్దియా స్వచ్ఛ ఆటోలు ఇవ్వడంతో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. ఆ వ్యర్థాలను డంపింగ్ యార్డ్‌కు చేర్చి.. అందులో పనికొచ్చే చెత్తను ఏరుకుంటూ బతుకులు వెళ్లదీస్తారు. బస్తీలో సాయంత్రమైందంటే చాలు కొట్లాటలు, గొడవలు. ఇటీవలే ఓ వ్యక్తి మద్యం మత్తులో కన్నతల్లిని చంపేశాడు. దీనిని శాంతి భద్రతల సమస్యగానే కాకుండా సీఐ సైదులు మనస్సు కదిలించింది. ఈ బస్తీలో గస్తీ మాత్రమే కాకుండా ఇక్కడి నిరుపేదల పిల్లలకు అక్షరాలతో దోస్తీ చేయించాలని భావించాడు. అలా చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు, పెద్దల్లో మార్పు సాధ్యమవుతుందని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా దాసారం బస్తీని ఇన్స్పెక్టర్ సైదులు దత్తత తీసుకున్నారు.
అక్షరాలే నేస్తాలు..
దాసారం బస్తీలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 60 విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం బ్లాక్‌బోర్డును ఏర్పాటు చేసి సాయంత్రం వేళ ట్యూషన్ ప్రారంభించారు. ఈ పేద కుటుంబాల పిల్లలకు ఇప్పుడు అక్షరాలే నేస్తాలయ్యాయి. తెలుగు, ఆంగ్లం, హిందీతో పాటు సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణితం సబ్టెక్టులను పోలీసులు చక్కగా బోధిస్తున్నారు. బస్తీలో చదుకున్న ఇద్దరు యువతులతో పాటు మరో నలుగురు ట్యూషన్ టీచర్లను పోలీసులు ఏర్పాటు చేయించారు. బయట ట్యూషన్‌కు వెళ్తే ఒక్కో విద్యార్థికి నెలకు రూ.500 ఖర్చయ్యేవి. అంత డబ్బు పెట్టే స్థోమతలేని పేదలకు పోలీసుల ట్యూషన్ ఓ వరంలా మారింది. పిల్లలకు అవసరమైన పుస్తకాలు, నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఉచితంగా ఇస్తున్నారు.
గస్తీకి వెళ్లి పాఠాలు..
గస్తీకి వెళ్లిన పోలీసులు పాఠాలు కూడా బోధిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ట్యూషన్లు చెప్తున్నారు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు బస్తీకి పిల్లలకు ప్రేమానురాగాలతో పాఠాలు బోధిస్తున్నారు. చదివేటప్పుడు వారిలో కలిగే సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కూడా బస్తీకి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. పేదింటి బిడ్డల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తూ, గొడవలు పడకూడదని పోలీసులు చేసిన హితబోధ ఇక్కడి పెద్దల్లో మార్పు తెచ్చింది. ఫలితంగా ఇప్పుడు నేరాలు పూర్తిగా తగ్గిపోయాయి.
చదువుతోనే మార్పు
ఇది గరీబోళ్ల బస్తీ. రాత్రయితే చాలు.. మందుతాగి చీటికి మాటికి గొడవ పెట్టుకుని కొట్టుకునేవారు. దీనిని మేము శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడలేదు. బస్తీలో పిల్లలు చదువుకుంటే.. మార్పు వస్తుందని భావించాం. అందుకే గస్తీకి వెళ్లి బస్తీలో పాఠాలు చెప్పడం ప్రారంభించాం. మా ప్రయోగం ఫలించింది. పిల్లలకు చదువుతో మార్పు తీసుకురాగలిగాం. పెద్దల్లో కూడా మార్పు కనిపిస్తుంది. మేము చేస్తున్న పనికి స్వచ్ఛంద సంస్థ సహకరించింది. పిల్లలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు ఉచితంగా ఇచ్చారు. చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందనే భరోసాను పిల్లల్లో కలిగించాం.
చదువు విలువ తెలిసింది
బడికి వెళ్లొచ్చాక పుస్తకాలు ఇంట్లో పెట్టి నా బిడ్డ బయట ఆడుకునేది. మా పనుల్లో మేము ఉండేవాళ్లం. బిడ్డ ఏం చదువుతున్నదో మాకు తెల్వదు. కూర్చుండబెట్టి చదివించాలన్నా.. మాకు తెల్వదాయె. చదువు విలువ మాకు అంత తెలిసేది కాదు. ఇన్నాళ్లు మా పాప చదువుపై నిర్లక్ష్యం వహించామని మాత్రం ఇప్పడే తెలిసింది. బస్తీలోనే సాయంత్రం పూట పోలీసులు పాఠాలు చెప్తుండడంతో చదువుపై ఆసక్తి, పోలీసులపై అభిమానం పెరిగింది. పిల్లలకూ చదువుపై శ్రద్ధ వచ్చింది.
– బాలరాజు, విద్యార్థిని తండ్రి
పోలీసుల మేలు మరువలేం
నేను చదువుకోలేదు. చెత్త ఆటో నడిపిస్తా.. నాకు ఇద్దరు కూతుళ్లు. వారిని బాగా చదువుకోమని చెప్తా.. కానీ వారేం చదువుతున్నారో తెలియదు. కరోనా కాలంలో బడి కూడా బంద్ అయింది. బయట ట్యూషన్ పెట్టిస్తామంటే.. అంత ఖర్చు మాతోని కాదు. ఇపుడు బస్తీలోనే పోలీసులు ఉచితంగా ట్యూషన్ పెట్టిండ్రు. మా ఇద్దరు పిల్లలు పోతున్నరు. చదువుల విలువ చెప్పిన పోలీసుల మేలు మరువలేము.
– సురేశ్, విద్యార్థినుల తండ్రి