సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం స్వామివారికి గర్భాలయంలో రుద్రస్వాహాకార హోమం ఘనంగా నిర్వహించారు.
కీసరగుట్టలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
బిల్వార్చనలు, రుద్ర స్వాహాకార హోమాలు
ఉత్సవ మూర్తుల ఊరేగింపు
అట్టహాసంగా పోశమ్మ అంగడి
కీసర, ఫిబ్రవరి 28 : సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం స్వామివారికి గర్భాలయంలో రుద్రస్వాహాకార హోమం ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారికి మంథిని గ్రూప్ నిర్వాహకులు, కీసరగుట్ట దాత లక్ష రుద్రాక్షలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. టీటీడీ వేదపండితులు యాగశాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి బిల్వార్చన, రుద్రస్వాహకార హోమం, ప్రదోషకాల పూజ, నీరాజన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తులకు వసతి సౌకర్యాలు
కీసరగుట్టకు విచ్చేసే భక్తులకు తగిన వసతి సదుపాయాలు, సౌకర్యాలను కల్పిస్తున్నామని కలెక్టర్ హరీశ్ చెప్పారు. కీసరగుట్ట జాతర సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ గెస్ట్‌హౌజ్‌లో అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని అన్నారు. మహాశివరాత్రి రోజున భక్తులు భారీగా తరలివస్తారని అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఆలయంలో పరిశుభ్రతకు జిల్లా పంచాయతీ అధికారులు బాధ్యత వహించాలని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులు అందుబాటులో ఉంచాలని, చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులు బందోబస్తు చూసుకోవాలని, కీసరగుట్టలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ పోలీసులను ఆదేశించారు. మిషన్‌భగీరథ అధికారులు తాగునీరు, ఫుడ్ ఇన్స్పెక్టర్ భోజనాలు, తినుబండారులు పర్యవేక్షించాలన్నారు. విద్యుత్‌శాఖ, మత్స్యశాఖ, అగ్నిమాపక శాఖల వారు ఎప్పటికప్పుడు ఆప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, దేవాలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ, కీసరగుట్ట ఈవో కట్టా సుధాకర్‌రెడ్డి, రాచకొండ డీసీపీ శ్రీబాలలక్ష్మీ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జునరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోశమ్మ అంగడి..
కీసర మండల కేంద్రంలో సోమవారం పోశమ్మ అంగడి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ అంగడికి ప్రతి సంవత్సరం నగర ప్రాంతంలోని అమ్ముగూడ, వంపుగూడ, కౌకూర్, యాప్రాల్ ప్రాంతాలకు చెందిన తమిళ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పోశమ్మ అమ్మవారికి మొక్కులను చెల్లించిన అనంతరం రాత్రి కీసరగుట్టకు వెళుతారు. ప్రతి సంవత్సరం అరువ భక్తులు కీసరగుట్టకు వచ్చి మూడు రోజుల పాటు స్వామివారి సన్నిధానంలో గడిపి వెళుతారు.
ఘనంగా స్వామివారి ఊరేగింపు..
కీసరగుట్ట భవానీరామలింగేశ్వరస్వామివారిని ఆదివారం రాత్రి కీసరకు చెందిన ముదిరాజ్‌లు వంశపారంపర్య సంప్రదాయంలో భాగంగా పల్లకీలో కీసరకు తీసుకొచ్చారు. సోమవారం రాత్రి కీసరగుట్టలో స్వామివారి కల్యాణం ఉండటంతో కీసరలో ఉన్న భవానీ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కీసరగుట్ట వరకు భారీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు అడుగడుగునా స్వామివారిని దర్శించుకొన్నారు.
జాతరకు 200 బస్సులు
చర్లపల్లి, ఫిబ్రవరి 28 : కుషాయిగూడ ఆర్టీసీ డిపో పరిధిలోని ఈసీఐఎల్ బస్ టెర్మినల్‌లో శివరాత్రి, కీసర గుట్ట జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన నూతన బస్‌షెల్టర్‌ను సోమవారం సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ యుగేందర్, డివిజనల్ మేనేజర్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీసర జాతర సందర్భంగా గుట్టకు 200 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ డిపో మేనేజర్ సుధాకర్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీపతి
కృష్ణ పాల్గొన్నారు.
వైభవంగా కల్యాణం
కీసర శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి కల్యాణం వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందురోజు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, తలంబ్రాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణంలో మంత్రి దంపతులతో పాటు, ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ దంపతులు కూర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కలెక్టర్ హరీశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకొస్తున్న మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ హరీశ్ దంపతులు