సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. తియ్యని మాటలతో వల వేస్తున్నారు.. నమ్మి వారి దారికి రాగానే వాత పెడుతున్నారు. నిత్యం ఇలాంటి మోసాలు వెలుగుచూస్తున్నప్పటికీ జనం మారడం లేదు. పోలీసులు ఎంత చెప్పినా వినడం లేదు. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు.., ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు.., వృద్ధులు, యువకులు ఇలా అందరూ సైబర్ బాధితులుగా మారుతున్నారు. అధిక లాభాలనే మాట వినగానే.. ముందూ వెనక ఆలోచించకుండా.., ఎవరనేది తెలుసుకోకుండానే లక్ష లు ధారపోస్తున్నారు. చివరికి సైబర్ నేరగాళ్ల ఫోన్లు స్విచ్చాఫ్ కాగానే.. కండ్లు తెరుస్తున్నారు. చేతులు కాలాకా.. ఆకులు పట్టుకున్నట్లు.. కుటుంబాన్ని రోడ్డున పడే సి.. గుండెలు బాదుకుంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అలాంటివే కొ న్ని ఉదాహరణలు ఇవి..
సిటీబ్యూరో, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): తీన్‌పత్తి వెబ్‌సైట్‌కు ఆకర్షితుడైన ఓ యువకుడు ఏకంగా రూ.70 లక్షలు సైబర్ నేరగాళ్లకు ముట్టజెప్పాడు. కుటుం బం రోడ్డున పడటంతో మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్‌పేట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తిచేశాడు. ఓ కన్సల్టెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడి ఫేస్బుక్లో వచ్చిన తీన్‌పత్తి వెబ్‌సైట్‌కు ఆకర్షితుడయ్యాడు. అందులో ఉన్న నంబర్లను చాటింగ్ ద్వారా సంప్రదించాడు. తీన్‌పత్తి వెబ్సైట్లో వాటాను కొనుగోలు చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ వెబ్సైట్ నిర్వాహకులు నమ్మించారు. ఓ లింక్ పంపించి టీపీ రియల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని లింక్‌ను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన ఖాతాలకు దాదాపు రూ.70 లక్షలు పెట్టుబడి కింద బదిలీ చేశాడు. అయితే లింక్‌లో లాభాలు చూపిస్తున్నప్పటికీ నగదు తీసుకునే వీలు కాలేదు. దీంతో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. చేసేదిలేక మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేవైసీ అప్డేట్ పేరుతో..
రూ.14.5 లక్షలు టోకరా
కేవైసీ అప్డేట్ పేరుతో ఓ వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు రూ.14.5 లక్షలు టోకరా వేశారు. మాసబ్‌ట్యాంక్‌లో నివాసముండే రిటైర్డు ఉద్యోగికి తన బ్యాంకు ఖాతా కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ఎనీడెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేయించి.. రూ.14.5 లక్షలు కాజేశారు. బాధితుడు సోమవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రూ.4.5 లక్షలు టోకరా
కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ వచ్చిన మెసేజ్‌కు స్పందించిన ఓ యువకుడు సైబర్‌నేరగాళ్లకు చిక్కి రూ.4.5 లక్షలు పోగొట్టుకున్నాడు.