సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ఓ రిటైర్డ్ ఉద్యోగిని 14మంది గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లో సంప్రదించారు. షుగర్ వ్యాధి నియంత్రించే మూలికలు ఉన్నాయంటూ చాటింగ్ చేశారు. ఆ తర్వాత విదేశాల్లో సిమెంట్, పవర్ ప్లాంట్లో పెట్టుబడులంటూ నమ్మించి రూ.16 లక్షలు కొట్టేశారు.
వివరాల్లోకి వెళితే..
నిజాంపేట బాలాజీ కాలనీకి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి విశాల్ కశ్యప్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్టు వచ్చింది. తమ దగ్గర షుగర్ వ్యాధిని నియంత్రించే టొడ్డలియా అయ్యూలేట మూలికలు ఉన్నాయని, ఇది కేవలం హిమాలయ పర్వతాల్లోనే దొరుకుతుందని పేర్కొంటూ చాటింగ్ చేశారు. ఒక ప్యాకెట్ ధర.50 వేలు ఉంటుందని పేర్కొన్నారు. ఇది నిజమని నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి మూడు ప్యాకెట్లకు ఆర్డర్ ఇచ్చాడు. గుర్తు తెలియని వ్యక్తులు తెలిపిన ఖాతాల్లోకి డబ్బులు జమ చేశాడు.
విదేశాల్లో వ్యాపారమంటూ..
ఇంతలోనే మరికొంత మంది విశాల్ కశ్యప్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేశారు. విదేశాల్లో సిమెంట్, పవర్ ప్లాంట్లు కొంటున్నాం.. మీరు అందులో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు రావడంతో పాటు మీకు విదేశాల్లో వ్యాపారం ఉంటుందని నమ్మించారు. ఇలా రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.16 లక్షల వరకు వసూలు చేసి ఫోన్లు స్విచ్చాప్ చేశారు. దీంతో మోసపోయానని భావించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.