సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని ఎట్టకేలకు సీసీఎస్ సెంట్రల్ జోన్ బృందం పట్టుకున్నది. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. అబిడ్స్ గన్‌ఫౌండ్రిలో నివాసముండే రిటైర్డు ఉద్యోగి వీఆర్ గణపతి ఫిబ్రవరి 22న కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లారు. తిరిగి 24న వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సెంట్రల్ జోన్ క్రైమ్ టీమ్ ఎస్సై హన్మంత్ నేతృత్వంలోని బృందం దొంగతనం చేసిన నిందితుడు అబిడ్స్‌కు చెందిన వి.విఘ్నేశ్గా గుర్తించి సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.30 లక్షల నగదు, రెండు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.