శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28 : మాదాపూర్‌లో సంచలనం సృష్టించిన చోరీకేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ పుటేజీ అధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఇంటి వాచ్‌మన్ కొడుకే నిందితుడని తేల్చారు. అతడి వద్ద నుంచి రూ.50 లక్షల విలువచేసే చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలు వెల్లడించారు. నారాయణ్‌పేట మండలం, ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన శివకుమార్(19) ఇంటర్మీడియట్ వరకు చదువుకొని నగరానికి వలసవచ్చాడు. గతంలో మాదాపూర్ కావూరిహిల్స్ ఫేజ్-2లో నివాసముండే బొడుగుం వాసుదేవారెడ్డి అనే వ్యాపారి ఇంట్లో వాచ్‌మన్‌గా విధులు నిర్వహించాడు. ఓ రోజు యజమాని ఇంటి తాళం చెవి మరిచిపోయి బయటకు వెళ్లాడు. ఇది గమనించిన శివకుమార్ సదరు తాళం చెవికి సంబంధించి నకిలీ తాళం చెవి చేయించాడు. తన స్థానంలో తండ్రిని వాచ్‌మన్‌గా పెట్టి.. యజమాని ఇంట్లో చోరీ చేయాలని అవకాశం కోసం వేచిఉన్నాడు. అంతలోనే కావూరిహిల్స్లోని హర్షా హోమ్స్ వద్ద పార్క్‌చేసి ఉన్న రాయల్ ఇన్ఫీల్డ్ ద్విచక్రవాహనాన్ని దొంగిలించి స్వగ్రామానికి వెళ్లాడు. బండి కలర్, నంబర్ ప్లేట్ మార్చేసి వాడుకుంటున్నాడు.
గోడదూకి.. ఇంట్లోకి చొరబడి..!
ఈనెల 24న సాయంత్రం 6:30 గంటలకు వాసుదేవారెడ్డి తన ఇంటికి తాళంవేసి అజీజ్‌నగర్‌కు చెందిన తన స్నేహితుడి ఫాంహౌజ్‌కు వెళ్లాడు. ఇదే అదునుకోసం వేచిఉన్న శివకుమార్ గోడదూకి నకిలీ తాళం చెవితో తాళం తీసి చోరీకి పాల్పడ్డాడు. రూ.24,63, 250 నగదు, 14 తులాల బంగారు అభరణాలు, 8134 యూఎస్ డాలర్లు, రెండు లైసెన్సులు, బెంజ్‌కారు ఆర్సీలను దొంగిలించి పారిపోయాడు. రాత్రి 10:30 గంటలకు ఇంటికి వచ్చిన వాసుదేవ రెడ్డి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
షాద్‌నగర్‌లో అరెస్టు
పోలీసులు సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితుడు శివకుమార్‌ను గుర్తించారు. దొంగిలించిన రాయల్ ఇన్ఫీల్డ్ వాహనంపై చోరీ సొత్తుతో పరారవుతుండగా 25న మధ్యాహ్నం షాద్‌నగర్ వద్ద పట్టుకున్నారు. అరెస్టు చేసి అతడి వద్దనుంచి రూ.50 లక్షల విలువచేసే చోరీసొత్తును, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన మాదాపూర్ పోలీసులను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. ఈ మీడియా సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్‌తో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.