ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 28: తార్నాకలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)లో సైన్స్ వారోత్సవాలు సోమవారం ఘనంగా ముగిసాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘ఫెస్టివల్ ఆఫ్ స్కోప్ (సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్ అండ్ ఇట్స్ ఎక్స్టెన్షన్) ఫర్ ఆల్’ పేరుతో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మాజీ వైస్ చాన్స్‌లర్, జేసీ బోస్ ఫెల్లో ప్రొఫెసర్ అప్పారావు, గౌరవ అతిథిగా అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ డీకే సింహా, ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత, వేడుకల కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ జి.భానుప్రకాశ్‌రెడ్డి, కన్వీనర్ డాక్టర్ సుబ్బారావు పాల్గొన్నారు.
గీతం యూనివర్సిటీలో..
సిటీబ్యూరో, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): సైన్స్ సమాజంతో ముడిపిడి ఉందని, అది సమాజాన్ని ప్రభావితం చేస్తుందని బాబా అణు పరిశోధనా సంస్థ పూర్వ డైరెక్టర్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ భద్రతా నిపుణుడు డాక్టర్ కేఎల్ రామకుమార్ అ న్నారు. సర్ సీవీ రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్‌ను గుర్తించుకోవడానికి, మన జాతి, విశ్వాభివృద్ధి కోసం శాస్త్రవేత్తలు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది నిర్వహించే సైన్స్ దినోత్సవాన్ని హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ వర్సిటీలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఆకాంక్ష ఛౌహాన్‌కు మొదటి బహుమతిగా రూ.20 వేలు, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు చెందిన ఆర్యన్ నూకాకు ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, ఇంజినీరింగ్ డైరెక్టర్ వీకే మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.