బంజారాహిల్స్, ఫిబ్రవరి 28: జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లో జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ ఆక్రమణలో ఉన్న రూ. 25కోట్ల విలువజేసే 1048 గజాల ప్రభుత్వ స్థలాన్ని షేక్‌పేట మండల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. షేక్‌పేట మండలం సర్వే నం. 403లో జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని ఆనుకుని కొంత ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో ఇటీవల సొసైటీ ఆధ్వర్యంలో గదుల నిర్మించారు. కాగా, ఈ స్థలం సొసైటీకి చెందినది కాకున్నా.. ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టారంటూ కొంతమంది స్థానికులు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సొసైటీ లే అవుట్‌ను పరిశీలించారు. లే అవుట్లో ఈ స్థలం లేకపోవడంతో ఇదంతా ప్రభుత్వ స్థలమని, దీన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలంటూ ఈనెల 16న జీహెచ్ఎంసీ ఈవీ డీఎం డైరెక్టర్ నుంచి షేక్‌పేట మండల తాసీల్దార్‌కు ఆదేశాలు వచ్చాయి. దీంతో స్థలాన్ని పరిశీలించడంతో పాటు ఆక్రమణలను గుర్తించిన తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో సుమారు రూ. 25కోట్ల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దాదాపు 334 గజాలలో ఇటీవల నిర్మించిన గదులను నేలమట్టం చేశారు.