సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): బహదూర్‌పల్లిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ అథారిటీ అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లో 101 ప్లాట్ల కొనుగోలుకు మంచి స్పందన వచ్చింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్‌పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ లేఅవుట్‌ను అభివృద్ధి చేసి 101 ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి దాదాపు 120 మంది ఔత్సాహికులు హజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ అడిషనల్ జనరల్ మేనేజర్ రేణు పురుషోత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆన్లైన్ వేలంలో పాల్గొనేందుకు అవసరమైన విధివిధానాలను వివరించారు. మార్చి 14,15 తేదీల్లో బహదూర్‌పల్లిలో 101 ప్లాట్లకు ఆన్లైన్ వేలం ఉంటుందని తెలిపారు. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లకు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని సెక్రటరీ పి.చంద్రయ్య తెలిపారు. బహదూర్‌పల్లిలో 40 ఎకరాల్లో చేపట్టే లేఅవుట్లో 80, 60, 40 అడుగుల విస్తీర్ణంలో రోడ్లు, విద్యుత్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌలికవసతులను కల్పిస్తున్నామని తెలిపారు. క్లియర్ టైటిల్‌తో కూడిన ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా సొంతం చేసుకోవచ్చని తెలిపారు.
బహదూర్‌పల్లి లేఅవుట్ మల్టీ పర్పస్ జోన్ కింద వస్తుందని, ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్ కార్యకలాపాలకు హెచ్ఎండీఏ అనుమతులు ఇస్తుందని తెలిపారు. సమావేశంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్. ఎన్.రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ విజయలక్ష్మీ, ప్లానింగ్ ఆఫీసర్ యశ్వంత్‌రావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ యూసుఫ్ హుస్సేన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రజిత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గౌతమి పాల్గొన్నారు.