సికింద్రాబాద్, ఫిబ్రవరి 23: కేంద్ర రక్షణ శాఖ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను విడుదల చేయించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఈవో అజిత్‌రెడ్డిని ఎమ్మెల్యే సాయన్న కోరారు. ఈ మేరకు బుధవారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి బోర్డు కార్యాలయంలో సీఈవోతో సమావేశమయ్యారు. బోర్డు పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సహకరించాలని, అధికారులు త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పలు అంశాలతో పాటు సర్వీస్ చార్జీల బకాయిలను తెప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కంటోన్మెంట్ బోర్డుకు దాదాపు రూ. 670 కోట్లు సర్వీస్ చార్జీలు రావాల్సి ఉందని, ఇందులో కనీసం రూ. 300 కోట్లను విడుదల చేస్తే కంటోన్మెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు.
సర్వీస్ చార్జీలపై కేంద్రం స్పందించకుంటే బోర్డు కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు. నిత్యం నీతులు చెప్పే బీజేపీ నేతలకు బకాయిలును తెప్పించే దమ్ముందా అని ప్రశ్నించారు. టీపీటీ చార్జీలను జీహెచ్ఎంసీలో 7.5 శాతం వసూలు చేస్తున్నా.. దాని కంటే కంటోన్మెంట్లో అదనంగా 5 శాతం వసూలు చేస్తున్నారని, దీని వల్ల ప్రజలపై భారం పడుతున్నదని సీఈవోకు వివరించారు. దీనికి స్పందించిన సీఈవో త్వరలో జరుగబోయే బోర్డు సమావేశంలో దీనిపై చర్చిద్దామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.