సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): పశువుల నుంచి అధిక లీటర్లలో పాలు సేకరించేందుకు ఇచ్చే ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న ఇద్దరిని రాచకొండ మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి 223 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ ఎస్వోటీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..జవహర్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఉస్మానియా టీచర్స్ కాలనీకి చెందిన బచ్చు సత్యనారాయణ పశువులకు దాణాను విక్రయించే దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అతడి స్నేహితుడు మరో షాపు నిర్వాహకుడు రాజుయాదవ్ ద్వారా చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన నాసర్ నుంచి ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను తెప్పించి.. వాటిని అధిక ధరలకు పాడి పశువుల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం రాజుయాదవ్, బచ్చు సత్యనారాయణలను అరెస్టు చేసింది. ఆక్సిటోసిన్ పాడి పశువులకు ఇస్తే.. వాటి ఆయుష్షు తగ్గుతుందని, అలా వచ్చే పాలను తాగితే.. క్యాన్సర్ వస్తుందని పోలీసులు తెలిపారు.