బోడుప్పల్, ఫిబ్రవరి 23: రాష్ట్రంలోని 70 లక్షల ఎస్సీ కుటుంబాల పేదరికాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్దులై ఉన్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. చెంగిచర్ల మాంస పరిశోధన సంస్థలో బుధవారం ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక చేయూతతో నిర్వహించనున్న మొబైల్ టిఫిన్ సెంటర్ల నిర్వహణ అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. విమర్శకుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో సీఎం కేసీఆర్ పూర్తిచేశారని తెలిపారు. మల్లన్న సాగర్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారంటూ మంత్రి కొనియాడారు.
దళిత బంధు దేశానికే ఆదర్శం..
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దళిత బంధు పథకానికి రూ. 20 నుంచి 25 వేల కోట్ల నిధులను సీఎం కేసీఆర్ కేటాయించనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దేశంలో ఏ సీఎంకు రాని ఆలోచనలతో దళిత బంధు పథకానికి రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి బృహత్తర పథకం తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్సీఎం డైరెక్టర్ డాక్టర్ ఎస్బీ బుర్పే, శాస్త్రవేత్త బస్వారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, జనరల్ మేనేజర్ ఆనంద్‌కుమార్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు చెందిన టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు.