వెంగళరావునగర్, ఫిబ్రవరి 23 : ఆశ వర్కర్ల ఆశలు నెరవేరాయి.. పనిచేయని వ్యక్తిగత సెల్‌ఫోన్‌తో పడ్డ ఇబ్బందులన్నీ తొలగిపోయాయ్.. తెలంగాణ ప్రభుత్వమే స్వతహాగా ముందుకొచ్చి ఆశ వర్కర్లకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందించింది. ఈ బృహత్ కార్యక్రమాన్ని వెంగళరావునగర్ డివిజన్లోని సిద్ధార్థనగర్ కమ్యూనిటీ హాల్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కోటి 26 లక్షల రూపాయల విలువైన స్మార్ట్ఫోన్లను ఆశ వర్కర్లకు సహృదయంతో తెలంగాణ సర్కార్ అందజేసింది. వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమంలో భాగంగానే ఆశ వర్కర్లకు స్మార్ట్ఫోన్లను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రాకముందు సర్కారు దవాఖానల పరిస్థితి ఘోరంగా ఉండేదన్నారు. పేద రోగులకు కావాల్సిన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. గర్భవతుల ఆరోగ్యం విషయంలో ఆశ వర్కర్లు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని, రాత్రీ పగలనే తేడా లేకుండా ఆశ వర్కర్లు పని చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. విధి నిర్వహణలో ఉండే ఆశ వర్కర్లకు సౌకర్యంగా ఉండేందుకు స్మార్ట్ఫోన్లను ప్రభుత్వం అందజేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంటక్, ఎస్పీహెచ్ఓ అనురాధ, వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, బోరంబడ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.